రాజకీయాల్లో కొందరికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అలాంటి వారిలో ముద్రగడ పద్మనాభరెడ్డి ఒకరు. వాస్తవానికి కాపు నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ పద్మనాభం… ఎన్నికల్లో పవన్ గెలిస్తే తన పేరును రెడ్డిగా మార్చుకుంటా అని శపధం చేశాడు. అన్నట్లుగానే పద్మనాభరెడ్డి అని మార్చుకుని గెజిట్ కూడా చేయించుకున్నాడు. ఇదేం మొండి పని అని చివరికి కాపు నేతలంతా విమర్శలు చేశారు కూడా. అయినా సరే… ముద్రగడ మాత్రం ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అయితే ఇప్పుడు ముద్రగడ వేస్తున్న అడుగులు చూస్తుంటే… పంతాన్ని పక్కన పెట్టినట్లే తెలుస్తుంది. అయితే అది పేరు విషయంలో మాత్రం కాదు… కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం ముద్రగడ రెండు అడుగులు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
Also Read : తెలంగాణలో గేర్ మార్చిన కమలం పార్టీ…!
ముద్రగడ సొంత నియోజకవర్గం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు. 1962, 1967లో వరుసగా రెండుసార్లు అక్కడి నుంచి ముద్రగడ తండ్రి వీర రాఘవరావు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత 1978లో తొలిసారి ముద్రగడ కూడా అదే ప్రత్తిపాడు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో 1983, 1985లో వరుసగా రెండుసార్లు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే అనూహ్యంగా 1989లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ముద్రగడ పద్మనాభ రెడ్డి… (అప్పట్లో పద్మనాభం…) అదే ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి హ్యాట్రిక్ సాధించారు. అయితే టీడీపీ హవాలో 1994లో ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముద్రగడ ఓడిపోయారు. దీంతో.. తీవ్ర మనస్థాపం చెందిన పద్మనాభ రెడ్డి… ఇక జన్మలో ప్రత్తిపాడు వైపు చూసేది లేదని తేల్చి చెప్పారు.
15 ఏళ్ల తర్వాత 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్రగడను స్వయంగా పిలిపించి ప్రత్తిపాడు నుంచి పోటీ చేసేందుకు ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ముద్రగడ మాత్రం.. తన ఒట్టు తీసి గట్టు మీద పెట్టే సమస్య లేదని తేల్చి చెప్పడంతో… తప్పని పరిస్థితుల్లో పిఠాపురం టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన ముద్రగడ ఓడిపోయాడు. నాటి నుంచి టార్గెట్ టీడీపీ అన్నట్లుగా లేఖలు రాస్తున్నారు తప్ప… ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిందే లేదు. అయితే తాజాగా ముద్రగడ పద్మనాభ రెడ్డి చూపు మరోసారి ప్రత్తిపాడు మీద పడిందనేది ఆయన సన్నిహుతల మాట. కాపు ఓట్లు అధికంగా పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీంతో పిఠాపురం పవన్ అడ్డాగా మారిపోయింది కూడా. రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచే పవన్ మరోసారి పోటీ చేస్తాడనేది పొలిటికల్ సర్కిల్‌లో వినిపిస్తున్న మాట.
Also Read : నేనే రాజు… నేనే మంత్రి… నా మాటే శాసనం…!
కొడుకు ముద్రగడ గిరిబాబును ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకురావాలనేది ముద్రగడ పద్మనాభరెడ్డి ప్లాన్. ఈ నేపథ్యంలో పిఠాపురం నుంచి బరిలోకి దింపితే పవన్ వంటి నేతను తట్టుకోవడం కష్టం. కాబట్టి… తమ సొంత నియోజకవర్గం ప్రత్తిపాడు అయితే ఏ సమస్య రాదనేది ముద్రగడ ప్లాన్. గిరిబాబును ప్రత్తిపాడు వైసీపీ ఇంఛార్జ్‌గా జగన్ నియమిస్తాడని ఇప్పటికే తమ అనుచరులకు పద్మనాభరెడ్డి చెప్పేశారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రత్తిపాడులో గ్రౌండ్ వర్క్ చేసుకుంటే తప్ప… కొడుకు గెలుపు సులభం కాదనేది ముద్రగడ గేమ్ ప్లాన్. ఇన్ని రోజులు ఇంత నిగ్రహంతో… మాట మీద నిలబడిన వ్యక్తి… ఇలా కొడుకు కోసం వెనక్కి తగ్గారనేది సన్నిహితుల మాట. అటు ప్రత్తిపాడులో మాత్రం… మమ్మల్ని కాదనుకున్న నేతను ఎలా ఆదరిస్తామనే మాట నియోజకవర్గంలో బలంగా వినిపిస్తోంది. కొడుకు కోసం శపథం పక్కన పెట్టిన ముద్రగడను ప్రత్తిపాడు ప్రజలు ఆదరిస్తారో లేదో చూడాలి మరి.