ఏపీ మంత్రివర్గంలో అత్యధికులు మంచి విద్యార్హత ఉన్నవారే అన్న ఆనందం ఎక్కువరోజులు ఉండనీయడంలేదు సదరు మంత్రుల వద్ద చేరిన వ్యక్తిగత సహాయకులు. మంత్రుల వద్ద ఉండే కొందరు కొన్ని విషయాల్లో ఎంత తక్కువ జోక్యం చేసుకుంటే అంత మంచిది. అనవసర వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే మాత్రం పరిస్థితి సదరు మంత్రికే ఇబ్బందిగా మారొచ్చు. ఇప్పుడు ఏపీలో కొందరు మంత్రుల వద్ద ఉండే వ్యక్తిగత సిబ్బంది వ్యవహారశైలి అధికారులను సైతం చికాకు పెడుతుందని వార్తలు వస్తున్నాయి.
తమకు సంబంధం లేని విషయాల్లో కూడా వారి జోక్యం మితిమీరి ఉంటుంది. ఇది మంత్రుల పేషీలకే ప్రమాదకరంగా మారిన అంశం. ఏపీలో ఒక మహిళా మంత్రి గారికి వ్యక్తిగతంగా చాలా మంచి ఇమేజ్ ఉంది. ఆమెకు ఒక పిఏ ఉన్నాడు.. ముందు నుంచి ఆమెతోనే ఉండటంతో ఆయనకు మంచి ప్రాధాన్యత ఇస్తారు మంత్రి గారు. ఈ ప్రాధాన్యత చివరికి మంత్రి గారి స్నేహితులకు, ఆమె వద్దకు వెళ్ళే అధికారులకు కూడా తలనొప్పి అయింది. మంత్రి గారి పని తీరు గొప్పగా ఉంది గాని.. పిఏ హడావుడి మాత్రం చికాకుగా ఉందని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన ఒక మహిళా నేత మంత్రి గారికి చాలా సన్నిహితం. ఆమెతో కలిసి గత అయిదేళ్ళు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా పోరాటాలు చేసారు. ఆమెకు అన్నీ తానై అండగా నిలబడ్డారు. కానీ సదరు మహిళా నేతను… మంత్రి గారి వద్దకు వెళ్ళనీయలేదు ఆ పిఏ. దీనితో స్వయంగా ఆ మహిళా నాయకురాలు మంత్రి గారికి ఫోన్ చేసి చెప్పడంతో, కింద భద్రతా సిబ్బందికి చెప్పి… ఆమె ఎప్పుడు వచ్చినా అనుమతించాలి అని ఆదేశాలు జారీ చేశారట. అలాగే కొందరు అధికారులను సైతం పిఏ వెయిట్ చేయించడం చికాకుగా మారింది. మంత్రి గారు చెప్పినా సరే పిఏ తీరులో మార్పు రాలేదు.
మంత్రి సొంత నియోజకవర్గానికి చెందిన వాళ్ళను కూడా పిఏ రానీయడం లేదు. ఆయనతో సన్నిహితంగా ఉండేవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. మంత్రి గారి రికమండేషన్ కంటే పిఏ రికమండేషన్ కు శక్తి ఎక్కువగా ఉంది. ఈ పిఏ గారి వ్యవహారం పార్టీ అధిష్టానం వరకు వెళ్ళింది. దీనితో సచివాలయంలో మంత్రి గారితో మాట్లాడిన పార్టీ పెద్దలు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారట. ఇటీవల ఒక ప్రముఖ సర్వే సంస్థకు చెందిన అధినేత కూడా దీనిపై సోషల్ మీడియాలో అసహనం వ్యక్తం చేసారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూస్తారో మంత్రి గారు.