ఆంధ్రప్రదేశ్ లో గూగుల్ సంస్థ అడుగు పెడుతున్న నేపథ్యంలో పలువురు ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చింది.. ఇప్పుడు గూగుల్ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మార్చబోతుందని ధీమా వ్యక్తం చేసారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఏపీకి పరిశ్రమలు తరలివస్తున్నాయి.. కేవలం డేటా సెంటర్ మాత్రమే కాదు.. ఏఐకి సంబంధించిన అనేక కంపెనీలు విశాఖకు వస్తున్నాయన్నారు. గూగుల్ పెట్టుబడి వల్ల లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు కలగనున్నాయని పేర్కొన్నారు.
Also Read : ఇక చాలు.. నెల్లూరులో జగన్‌కు షాక్ తప్పదా..?
సెప్టెంబర్-2024లో గూగుల్ ప్రతినిధులు విశాఖ వచ్చినప్పుడు వారితో సమావేశమయ్యాను.. గూగుల్ ప్రతినిధులకు డేటా సెంటర్ స్థలాన్ని చూపించామన్న ఆయన.. ఇది జరిగిన నెలరోజుల్లో యూఎస్‌కు వెళ్లి గూగుల్ క్లౌడ్ నాయకత్వాన్ని కలిశాను.. 2024 నవంబర్‌లో గూగుల్ ప్రతినిధులు సీఎం చంద్రబాబును కలిశారని తెలిపారు. ఇదే అంశంపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి నిర్మలతో సీఎం చంద్రబాబు అనేకసార్లు భేటీ అయ్యారు.. అనేక చర్చల తర్వాత ఇంత పెద్ద పెట్టుబడి సాధ్యమైందన్నారు. భారీ పెట్టుబడులపై అన్నిచోట్ల చర్చలు జరుగుతున్నాయని హర్షం వ్యక్తంచేశారు.
Also Read : ఏపీ ఐటీ రంగానికి ప్రాణం పోసిన గూగుల్..!
చరిత్ర సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా.. చంద్రబాబుతోనే సాధ్యమన్నారు లోకేష్. ఆనాడు కియా ఏర్పాటుతో చరిత్ర సృష్టించాం.. ఇప్పుడు విశాఖలో గూగుల్ ఐదేళ్లలో మొత్తం 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని తెలిపారు. విజనరీ చంద్రబాబు ఆలోచనలకు హైదరాబాద్ ఓ ఉదాహరణ అన్నారు. పరిశ్రమలు తరిమేయడం.. వచ్చే పరిశ్రమలను అడ్డుకోవడం ప్రిజనరీ ఆలోచన అని, వైసీపీ పేటీఎం బ్యాచ్ తప్పుడు ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.. డేటా సెంటర్ అంటే ఏంటో గతంలో పనిచేసిన మంత్రికి తెలుసా? అని ప్రశ్నించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్నాం.. నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు యూనిట్‌కు 13 పైసలు తగ్గేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ అద్భుతమంటూనే.. పీపీపీ విధానంపై వైసీపీ విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఏదీ ప్రైవేటుపరం చేయట్లేదని తెలిసి కూడా వైసీపీ విద్వేషాలు రెచ్చగొడుతోందన్నారు.