తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడంలో ఎన్నికలకు ముందు రెడ్ బుక్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. రెడ్ బుక్ లో పేర్లు ఎవరివి ఉంటాయో అనే భయం కూడా వైసీపీ నేతలతో పాటు అధికారులలో కూడా మొదలైంది. మంత్రి లోకేష్… దీనికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ విషయంలో దూకుడు లేదనే ఆరోపణలు వినిపించాయి. అయితే వీటికి ఇప్పుడిప్పుడే సమాధానం వస్తోంది అంటున్నారు పరిశీలకులు. జరుగుతున్న పరిణామాలను టీడీపీ సోషల్ మీడియా గమనించడం లేదు అంటున్నారు.
జత్వాని కేసు విషయంలో… ఐపిఎస్ అధికారులపై వేటు పడింది. ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ కార్యాలయంపై దాడి విషయంలో మాత్రం ముందు అడుగు పడలేదు అనే అసహనం ఉన్నా… సిఐడీకి ఇచ్చిన తర్వాత కీలక పరిణామాలు ఉండవచ్చని చెప్తున్నారు. ఇక బోరుగడ్డ అనీల్ విషయంలో దూకుడుగా అడుగులు పడ్డాయి అనే మాట వాస్తవం. అతను ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు కి తరలించారు. అతనిని విచారించగా పలువురు కీలక నేతల పేర్లు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇక అతన్ని పరామర్శించడానికి కూడా ఎవరూ రాకపోవడం గమనార్హం.
Also Read : సంచలన అతిథులతో సీజన్ 4 అన్ స్టాపబుల్ షో
అలాగే వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడ్ని మదురైలో ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనం అయింది. ఓ హత్య కేసులో అతన్ని అరెస్ట్ చేసారు. ఇక విశాఖ మాజీ ఎంపీ విషయంలో కూడా దాడులు జరుగుతున్నాయి. అతని అక్రమాలను వెలుగులోకి తెస్తున్నారు. విశాఖ శారదాపీఠం విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. అతను కూడా ఇప్పుడిప్పుడే బయటకి రావడం కష్టం అనే అభిప్రాయం అధికారుల్లో ఉంది. మరికొంతమంది సోషల్ మీడియా అభిమానులకి నోటీసులు ఇవ్వడం, మరికొందమందిని అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేయడం జరిగాయి. ఇలా ఒక్కో అడుగు చూస్తుంటే రెడ్ బుక్ ఇన్ యాక్షన్ అనే విషయం అర్ధమవుతోంది అంటున్నారు జనాలు.




