దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మరో 2 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. నేతలు ప్రచారంలో నిమగ్నం అయ్యారు. ఎన్నికల ముందు ఆప్‌కు భారీ షాక్ తగిలింది. ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీకి బై బై చెప్పారు. అభ్యర్థులు, పార్టీల అధినేతలు వరుస ప్రచారాలతో స్పీచులతో హోరెత్తిస్తున్నారు. యమునా నదిలో హర్యానా ప్రభుత్వం విషం కలుపుతుందంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో.. వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల కమిషన్ ఎదుట కేజ్రీవాల్ హాజరయ్యారు. ఎన్నికలను ప్రభావితం చేయడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. యమునా నదిలో అమ్మోనియం వ్యవహరం వెనుక హర్యానా ప్రభుత్వం ఉందన్నారు..
Also Read : మంత్రులకు సీఎం భయం.. సచివాలయం వదలట్లేదు..!
కేజ్రీవాల్‌కు హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ మరోసారి కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు.. కేజ్రీవాల్ యమునా డ్రామా ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. హర్యానా నుంచి స్వచ్ఛమైన నీటిని ఇస్తున్నామని.. ఢిల్లీ శివారు ఫరిదాబాద్‌లో యమునా నదిలో రసాయనాలు, కలుషిత నీరు కలుస్తున్నాయన్నారు. పదేళ్లుగా యమునా నదిని కేజ్రీవాల్ ప్రభుత్వం శుభ్రం చేయలేదంటూ నాయబ్ మండిపడ్డారు.
ఢిల్లీ ద్వారకా ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌పై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. దేశ రాజధాని ఢిల్లీని ఆమ్ఆద్మీపార్టీ ఏటీఎంలా మార్చుకుందని ఆరోపించారు. ప్రతి పేదవాడికి ఇళ్లు ఉండాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలతో కేజ్రీవాల్ సర్కార్ అడ్డుకుంటుందోందన్నారు. ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆప్ అవినీతిపై విచారణ చేస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు..
Also Read : రికార్డుల దుమ్ము దులిపిన యువీ శిష్యుడు
ఎన్నికల ముందు ఏడుగురు ఎమ్మెల్యేలు ఆమ్ఆద్మీ పార్టీని వీడారు. ఎమ్మెల్యేలు భావనా గౌర్, మదన్‌లాల్, మెహ్రలియా, రాజేష్ రిషి, నరేష్ యాదవ్, పవన్ శర్మ, బిజ్వాస్ రాజీనామా చేశారు. అయితే ఈసారి ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు వీరెవరికీ కేజ్రీవాల్ అవకాశం ఇవ్వలేదు. ఇదిలా ఉంటే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రచారంలో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో రోడ్ షో నిర్వహించి.. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

