ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఈడీ దూకుడుగా వెళ్తోంది. మనీ లాండరింగ్ ఫెమా నిబంధనలను ఉల్లంఘించారనే అభియోగాల నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఈడీ అధికారులు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు జనవరి 7న విచారణకు హాజరు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ గురువారం ఈడీ విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. మరో అధికారి బీఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ అధికారులు శుక్రవారం విచారణ చేయనున్నారు. చివరగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల ఏడో తేదీన ఈడీ విచారణను ఎదుర్కొనున్నారు. వాళ్లు ఇచ్చే స్టేట్‌మెంట్ ఆధారంగానే కేటీఆర్‌పై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉండటంతో వాళ్లు ఏం చెబుతారా.. అనే టెన్షన్ బీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
Also Read : ఒక్క రోజే 2 వేల మందితో చంద్రబాబు.. కుటుంబానికి దూరంగా.. క్యాడర్ కు దగ్గరగా…!
మరోవైపు ఫార్ములా ఈ రేసు కేసులో తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై విచారణ ముగిసింది. తీర్పు ఇచ్చే వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయొద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. కాగా కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై గతంలో విచారణ సందర్భంగా గత ఏడాది డిసెంబర్ 30వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా కేటీఆర్‌పై ఏసీబీ నమోదు చేసిన కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని పేర్కొంది. 10 రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ, తదుపరి విచారణను గత ఏడాది డిసెంబర్27వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఆ తర్వాత విచారణ గత ఏడాది డిసెంబర్ 31వ తేదీకి వాయిదా పడింది. తాజాగా ఇరు వైపులా వాదనలు ముగియడంతో.. కేటీఆర్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. తుది తీర్పు విడుదల చేసేంత వరకూ కేటీఆర్‌ని అరెస్టు చేయొద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది.
Also Read : ఏపీలో గేమ్ చేంజ్ చేయనున్న పవన్ కళ్యాణ్
ఫార్ములా ఈ రేసు కేసుపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో తెలంగాణ హైకోర్టులో ఏ తీర్పు వస్తుందో చూద్దామన్నారు. ఇందులో అవినీతే లేనప్పుడు.. కేసు ఎక్కడిది అని ప్రశ్నించారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ తప్పు అని వ్యాఖ్యానించారు. ఈడీ ఎదుట ఈనెల 7న హాజరుపై తన లాయర్లు నిర్ణయిస్తారని తెలిపారు. ఏసీబీ కేసులో అస్సలు పస లేదని.. తనకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందన్నారు. ఫార్ములా ఈ కేసు లొట్టపీసు కేసు అంటూ వ్యాఖ్యలు చేశారు. తనను ఏదో రకంగా జైలుకు పంపించాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తనపై ఇది ఆరో ప్రయత్నమని.. రేవంత్‌కు ఏమీ దొరకడం లేదంటూ సెటైర్లు వేశారు. రేసు కావాలని తాను నిర్ణయం తీసుకున్నాని.. వద్దనేది రేవంత్ నిర్ణయమన్నారు. ఇద్దరి నిర్ణయాలపై క్యాబినెట్‌లో చర్చ జరగలేదన్నారు. తనపై కేసు పెడితే.. రేవంత్‌పై కేసు పెట్టాలన్నారు.