ఏపీలో ప్రభుత్వం మారిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు కంగారు పెడుతున్నాయి. ముఖ్యంగా భూములకు సంబంధించిన పత్రాలు మాయం కావడం పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా పొన్నూరులో ఇదే పరిణామం చోటు చేసుకుంది. మదనపల్లి వ్యవహారం ఒక కొలిక్కి రాక ముందే తాజాగా పొన్నూరులో కీలక పత్రాలు మాయం అయ్యాయి. పొన్నూరు తహసీల్దారు కార్యాలయంలో కీలక దస్త్రాలు మాయం కావడం పట్ల ప్రభుత్వం సీరియస్ అయినట్టు తెలుస్తోంది.
స్థానిక సుందరవల్లి రాజ్యలక్ష్మీ సమేత సాక్షి భావనారాయణ స్వామి దేవాలయానికి చెందిన సర్వే నంబరు 221-1బిలో 25 ఎకరాల భూమి ఉండగ్గా 1998 సంవత్సరంలో 25 ఎకరాల భూమిని అప్పటి టీడీపీ సర్కార్ పేదలకు కేటాయించి పట్టాలను పంపిణీ చేసింది. ఆ కాలనీకి మాజీ రెవెన్యూ శాఖా మంత్రి ధూళిపాళ్ల వీరయ్య చౌదరి(డీవీసీ) పేరు పెట్టారు. అయితే ఈ భూమికి సంబంధించి నకిలీ పట్టాలు సృష్టించి అవినీతికి పాల్పడ్డారని అదే కాలనీకి చెందిన స్థానికుడు ఇచ్చిన ఫిర్యాదుతో సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు.
Also read : జగన్ కు షాక్ ఇవ్వనున్న వైసీపీ సీనియర్లు
పట్టాల జాబితా, విచారణకు సంబంధించిన ముఖ్య దస్త్రాలు తహసీల్దారు కార్యాలయంలో ఓ అధికారి ఆధీనంలో ఉండగా ఇటీవల జరిగిన ఎన్నికల కారణంగా ఆ కార్యాలయాన్ని పొన్నూరు పురపాలక సంఘ కార్యాలయానికి మార్చారు. ఆ సమయంలో ఎన్నికల దస్త్రాలను భద్రపరిచేందుకు కొత్త బీరువా కొనకుండా తహసీల్దారు కార్యాలయంలో ఉన్న దాన్నే మున్సిపల్ కార్యాలయానికి తరలించగా డీవీసీ కాలనీ, సీఐడీ విచారణకు సంబంధించిన కీలక దస్త్రాలను రెవెన్యూ అధికారి బయటకు తీసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం నడుస్తున్న సమయంలో పట్టాదారులు కొందరు తమకు డూప్లికేట్ పట్టాలు ఇవ్వమని కోరగా… దస్త్రాల కోసం కార్యాలయంలో అధికారులు వెతికారు. కానీ వాటి ఆచూకీ మాత్రం దొరకలేదు. దీనిపై పొన్నూరు ఇన్చార్జి తహసీల్దారు ఐ.ప్రశాంతిని వివరణ కోరారు.