ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కొన్ని కీలక శాఖల్లో ఫైళ్ళను కాల్చి బూడిద చేస్తున్న వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. తాజాగా మదనపల్లెలో జరిగిన అగ్ని ప్రమాదం వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మదనపల్లె సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో కీలక ఫైళ్ల దగ్ధంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అగ్నిప్రమాదంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ విషయం పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. మదనపల్లెకు డీజీపీ, సీఐడీ చీఫ్ వెంటనే వెళ్లాలని చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. విజయవాడ నుంచి ప్రభుత్వ ప్రత్యేక హెలికాప్టర్లో మదనపల్లెకు ఉన్నతాధికారులు బయల్దేరి వెళ్ళారు.
మదనపల్లె ఘటనపై విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ సహా మొత్తం వివరాలు కావాలన్న చంద్రబాబు… గత పది రోజులుగా ఆఫీసుకు వచ్చిన వారి వివరాలను సైతం సేకరించాలని ఆయన ఆదేశించారు. 25 కీలక రన్నింగ్ ఫైళ్లు దగ్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. మదనపల్లె సబ్ కలెక్టరేట్ కేంద్రంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి భూ దందాలు చేసినట్టు ఎన్నో ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ భూములన్నీ పెద్దిరెడ్డి మరియు అతని అనుచరుల గుప్పిట్లో ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుంది. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి అనుచరుల భూదందాలు తీవ్ర స్థాయిలో ఉన్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది.
గత ప్రభుత్వంలో అడ్డూ అదుపు లేకుండా భూకబ్జాలు చేసారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసారని… మాజీ మంత్రి పెద్దిరెడ్డి కనుసన్నల్లోనే ఆక్రమణలు జరిగాయని టీడీపీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. పెద్దిరెడ్డి ఆదేశాలతో భూ రికార్డులను అధికారులు మార్చినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇక విచారణ కమిటీని కూడా వేసే అవకాశం ఉంది. పుంగనూరు, మదనపల్లె పరిసరాల్లోనే దాదాపు 10 వేళా కోట్ల రూపాయల విలువ చేసే భూములు ఆక్రమణలకు గురైనట్లు అధికారులు అంతర్గతంగా చెబుతున్నారు. అంత భారీ స్థాయిలో చేసిన అక్రమాల గుట్టురట్టు అవుతుందనే భయంతోనే ఇలా ప్లాన్ చేసి అగ్నిప్రమాదం సృష్టించారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.