తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత వ్యవహారం సంచలనంగా మారింది. పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న కవిత తాజాగా మాజీ మంత్రి హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడింది హరీష్ రావు, సంతోష్ రావు అని.. వాళ్ళిద్దరి కారణంగానే కెసిఆర్ పరువు పోతుందంటూ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారనే, ఆయనను జలవనరుల శాఖ మంత్రిగా తప్పించారని కవిత కామెంట్ చేశారు. సిబిఐకి కేసు అప్పగించడంతో తమ తండ్రి పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read : తగ్గిన జీఎస్టీ.. ఏయే ధరలు తగ్గుతాయంటే..!
దీనితో కవిత వ్యవహారం భారత రాష్ట్ర సమితి అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఆమెను సస్పెండ్ చేయాలా వద్దా అనే విషయంలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. ఇటీవల కాలంలో పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న కవిత.. హరీష్ రావును నేరుగా టార్గెట్ చేయడంతో.. పార్టీ కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావుకు పార్టీలో ప్రతి నాయకుడితో మంచి సంబంధాలు ఉన్నాయి. వివాదాలకు దూరంగా ఉండే హరీష్ రావు కేసీఆర్ కు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు నమ్మకమైన నేతగా, అత్యంత బలమైన నాయకుడిగా కొనసాగుతున్నారు.
Also Read : ఏపీ స్థానిక సమరానికి ఎలక్షన్ కమిషన్ సిద్ధం..!
అలాంటి హరీష్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలు.. ఏమలుపు తిరుగుతాయా అనేది ఆసక్తిగా మారింది. అయితే కవితను సస్పెండ్ చేయాలని కొన్నాళ్లుగా కేటీఆర్ డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఈ విషయంలో నాయకులెవరూ, మాట్లాడవద్దని, కవిత వ్యవహారాన్ని పూర్తిగా కెసిఆర్ చూసుకుంటారని అధిష్టానం నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. మీడియా సమావేశాల్లో గాని లేదంటే సోషల్ మీడియాలో గాని కవితపై ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యాఖ్యలు చేస్తే చర్యలు తీసుకుంటామని కూడా అధిష్టానం హెచ్చరించినట్లు సమాచారం. అలాగే కవితతో నాయకులు ఎవరూ ప్రస్తుతానికి సంప్రదింపులు జరపొద్దని, తెలంగాణ జాగృతికి పూర్తిగా దూరంగా ఉండాలని కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కవిత ను పలువురు నాయకులు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేశారు. బీఆర్ఎస్ అధికారిక గ్రూపుల నుంచి కవిత పిఆర్ఓ ని తొలగించారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నేరుగా కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉండవచ్చుని రాజకీయ వర్గాలు అంటున్నాయి.