పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి జనసేన నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత యుద్ధం రోజురోజుకు దిగజారుతోంది. ఇటీవల జనసేన కీలక నేత నాగబాబు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టిడిపి నేతలపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గెలుపులో ఎవరి కృషి లేదని… కేవలం పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తలు మాత్రమే ఉన్నారంటూ నాగబాబు మాట్లాడారు. ఇక వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకుండా జనసేన పార్టీ అడ్డుపడుతుందనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి.
Also Read: ప్రత్యక్ష రాజకీయాల్లోకి భువనేశ్వరి..?
ఈ తరుణంలో తాజాగా నియోజకవర్గంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పిఠాపురం నియోజకవర్గంలో టిడిపి, జనసేన నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చందుర్తిలో వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. జనసేన ఇన్చార్జి శ్రీనివాసును టిడిపి నేతలు అడ్డుకున్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మను పిలవకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా… తోపులాట కూడా జరిగింది. ఇటీవల వర్మను ఉద్దేశించి నాగబాబు వ్యాఖ్యలు చేసిన తర్వాత అక్కడ వాతావరణం కాస్త ఇబ్బందికరంగానే ఉంది.
Also Read: కొడాలి నానికి ఏమైంది..?
అటు ప్రభుత్వ పెద్దలు కూడా పిఠాపురంలో పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వర్మను జనసేన పార్టీ నేతలు పట్టించుకోకపోవడం వివాదాస్పదమవుతుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కూడా వర్మకు ప్రాధాన్యత దక్కలేదు. జనసేన నేత ఎమ్మెల్సీ నాగబాబు మాత్రమే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యారు. ఇక జనసేన నియోజకవర్గ బాధ్యతలను కూడా నాగబాబు చూస్తున్నారు. అటు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో కూడా వర్మకు విభేదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.