అసెంబ్లీకి వచ్చేందుకు ముఖం చెల్లని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేసేందుకు మాత్రం రెడీ అంటున్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సమయం లేదంటున్నారు కానీ… బహిరంగ వేదికలపై మాత్రం తప్పులంటూ ప్రశ్నిస్తున్నారు. దాదాపు 9 నెలలుగా పూర్తిగా బెంగళూరు ప్యాలెస్‌కే పరిమితమయ్యారు జగన్. ఏదో అప్పుడప్పుడు చుట్టపు చూపుగా విజయవాడ వచ్చి… తాడేపల్లి ప్యాలెస్‌లోనిచ పార్టీ కార్యాలయంలో తమ పార్టీ నేతలతో ముఖాముఖి నిర్వహించి.. మళ్లీ తిరిగి బెంగళూరు వెళ్లిపోతున్నారు. అలా పది రోజులకోసారి వచ్చే రోజునే నియోజకవర్గాల నేతలు జగన్‌తో భేటీ అవుతున్నారు. అలాంటి సమయంలో తమకు అన్యాయం జరుగుతోందని చెప్పడంతో… మీ తరఫున నేను పోరాడుతా అంటూ జగన్ భరోసా ఇస్తున్నారు.
Also Read : తెలంగాణ అసెంబ్లీలో కుల చిచ్చు
పార్టీ ఘోర పరాజయం తర్వాత కొంతమంది సీనియర్ నేతలు సైతం వైసీపీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. దీంతో పార్టీ కేడర్‌లో కూడా భయం మొదలైంది. ఈ నేపథ్యంలోనే పార్టీని తిరిగి గాడిలో పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని చెబుతున్న జగన్… దానిని క్షేత్రస్థాయిలో రుజువు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. త్వరలోనే ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయి పోరాటం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. తాజాగా జగన్‌తో పల్నాడు జిల్లా నేతలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామస్తులు జగన్‌ను కలిశారు. వైసీపీ సానుభూతిపరులపై గ్రామ బహిష్కరణ వేటు వేశారని ఆరోపించారు. తమపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్‌కు వివరించారు. ఈ వివాదంపై ఇప్పటికే కోర్టులో కేసు వేసినట్లు కూడా వెల్లడించారు. దీంతో మీ తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు జగన్ భరోసా ఇచ్చారు. బాధితులకు వైసీపీ నుంచి పూర్తి సహకారం ఉంటుందన్నారు జగన్.
Also Read : మౌనమే.. విజయసాయి రెడ్డిపై సైలెంట్ గా వైసీపీ
త్వరలోనే పిన్నెల్లి గ్రామంలో పర్యటిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అలాగే బాధితులతో కలిసి పల్నాడు జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. త్వరలోనే ఛలో పిన్నెల్లి నిర్వహిస్తామంటూ జగన్ తెలిపారు. వైసీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు కూడా. అయితే జగన్ పిలుపునకు పల్నాడు జిల్లా నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. గతంలో ఇదే పల్నాడు జిల్లాకు చెందిన చంద్రయ్యను నడి రోడ్డుపై హత్య చేసినప్పుడు ఎందుకు ధర్నా చేయలేదని ప్రశ్నించారు. గ్రామంలో అడ్డుగా రోడ్డు నిర్మిస్తే.. చివరికి జాతీయ మానవ హక్కుల సంఘం కూడా నాటి వైసీపీకి ప్రభుత్వానికి నోటీసులిస్తే… ఏ చర్యలు తీసుకున్నావో వెల్లడించాలని నిలదీశారు. పల్నాడు జిల్లాలో ఐదేళ్ల వైసీపీ పాలనలో టీడీపీ నేతలపై ఎన్ని అక్రమ కేసులు నమోదు చేశారో తెలియదా అని నిలదీశారు. ప్రస్తుతం ఎవరిపైనా గ్రామ బహిష్కరణ వేటు లేదని… కూటమి పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని టీడీపీ నేతలు వెల్లడించారు. వర్గ విభేదాలు సృష్టించేందుకు వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.