ఓ వైపు ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. నీ పరిపాలన బాగోలేదు అంటూ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. నాయనా నీకో నమస్కారం.. నీతో కలిసి నడవలేం.. అని బంధువులు మొదలు.. ముఖ్య నేతల వరకు అంతా పార్టీకి రాజీనామా చేసి పారిపోయారు. నిన్నటి వరకు అండగా ఉన్న అధికారులు కూడా ఒక్కొక్కరుగా జైలుకు పోతున్నారు. ఇక రేపో మాపో లిక్కర్ మాఫియా కేసులో అరెస్టు కావడం ఖాయమనే మాట కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తోంది. అయినా సరే.. ఆ నమ్మకం చూస్తుంటే మాత్రం ఆశ్చర్యం వేస్తోంది. ఓ వైపు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువయ్యారనేది క్షేత్రస్థాయిలో కార్యకర్తల మాట. ఇక కొందరు ముఖ్య నేతలైతే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ వంటి ఒకరిద్దరు నేతలు మినహా సీనియర్లు సైతం సైలెంట్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు, చేస్తున్న వ్యాఖ్యలు చూస్తే మాత్రం భయమేస్తోంది.
Also Read : టీడీపీ సోషల్ మీడియాకు గుర్రంపాటి బెదిరింపులు
అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం రామకుప్పం మండలం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మున్సిపాలిటీ, పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం వైసీపీ స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఇందులో కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కార్యకర్తల బాధలు, కష్టాల్ని స్వయంగా చూస్తున్నా.. అందుకే జగన్ 2.Oలో టాప్ ప్రయారిటీ కార్యకర్తలకే ఇస్తా.. అంటూ హామీ ఇచ్చారు. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న పోలీసులు, అధికారుల పేర్లని రాసి పెట్టుకోండి.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సినిమా మామూలుగా ఉండదు.. వేరే లెవల్‌లో ఉంటుందంతే.. అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు జగన్.
Also Read : మాకే పాపం తెలియదు.. జగన్ ను ఇరికించిన కృష్ణ మోహన్ రెడ్డి
ఎవరెవరైతే పోలీసులు, అధికారులు ఇబ్బంది పెడుతున్నారో.. అందరి పేర్లు నోట్ చేసుకోండి.. నేను చెప్తున్నా.. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్‌కు ఉన్న విలువ అంటే ఏమిటో వాళ్లకు అర్థం కావాలి.. ప్రజలకు మేలు చేయడానికే యూనిఫామ్.. అంతే కానీ అధికారంలో ఉన్న వాళ్ల కోసం గులాం గిరి చేస్తూ.. చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో.. దీనికి తెర పడాలి అంటే.. నువ్వు భయపడే పరిస్థితిలోకి వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. ఎవడెవడు అయితే వైసీపీ కార్యకర్తను ఇబ్బంది పెట్టారో… అందర్నీ కూడా చూస్తూ ఉరుకోము.. రిటైర్ అయినా, దేశం విడిచిపోయినా సరే.. ఎవర్నీ వదిలిపెట్టం.. అంటూ జగన్ వ్యాఖ్యలు చేశారు.
Also Read : ఏపీ భవిష్యత్తు నిర్మిస్తున్నాం.. లోకేష్ ఆసక్తికర కామెంట్స్
గతంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో యువగళం పాదయాత్ర చేశారు నారా లోకేష్. అప్పుడు రెడ్ బుక్ పేరుతో హెచ్చరికలు చేశారు. టీడీపీ కార్యకర్తలను వేధించిన వారి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయన్నారు. దీంతో లోకేష్ చేసిన వ్యాక్యలపై నాటి ప్రభుత్వ పెద్దలు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఇలా ఉద్యోగులను బెదిరించడం ఏమిటని కేసులు పెట్టారు. లోకేష్ మమ్మల్ని బెదిరిస్తున్నారు అంటూ కొందరు అధికారులు కోర్టులో కేసులు వేశారు. ఇక నాటి ఉద్యోగ సంఘాల నేతలుగా వ్యవహరించిన ప్రస్తుత వైసీపీ నేతలు అయితే లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళన కూడా చేశారు. మరి ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యలు బెదిరింపులు కాదా.. ఉద్యోగులను.. ముఖ్యంగా పోలీసులను జగన్ బెదిరించడం లేదా అని సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది.