వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు. పాడిందే పాటరా.. పాసిపళ్ల దాసరా అన్నట్లుగా పది రోజులకోసారి అదే పాట మళ్లీ మళ్లీ పాడుతున్నారు. ఒకటే మాట చెబుతున్నారు. అంతే తప్ప అది ఎలా అవుతుందనే విషయం మాత్రం చెప్పటం లేదు. బెంగళూరు ఎలహంక ప్యాలెస్ నుంచి పది రోజుల తర్వాత తాడేపల్లి ప్యాలెస్‌కు వచ్చిన జగన్.. మళ్లీ తనకు అనుకూలమైన పది మందిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టారు. వాళ్లతో తాను ఏం చెప్పాలనుకున్నది చెప్పేసి సైలెంట్‌గా వెళ్లిపోయారు. అంతే తప్ప.. ప్రశ్నించేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అధికారం కోల్పోయిన ఏడాది అయినా కూడా ఇప్పటికీ అందుకు కారణాలను ఏ మాత్రం పరిశీలన చేసుకోలేదు. పైగా తాను అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మంచి పనులు చేశాను అని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేశారు. ప్రజలు తనను తిరస్కరించలేదని.. తన ఓటమికి ప్రజలు కారణం కాదంటున్నారు. ఓటర్లు తనకు అనుకూలంగానే ఓట్లు వేశారని మళ్లీ అదే మాట చెప్పుకొచ్చారు తప్ప.. తన ప్రభుత్వంలో జరిగిన అరాచకాలను భరించలేక ఏపీ ప్రజలు ఇంటికి పంపేశారు అనే మాట మాత్రం ఒప్పుకోవటం లేదు.
Also Read : ఏపీకి మెగా ప్రాజక్టు.. అంతా సిద్ధం..!
గుడివాడలో వైసీపీ సమావేశాన్ని టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. ఆ సమయంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికను పోలీసులు అడ్డుకున్నారు. సమావేశానికి వస్తే గొడవ జరుగుతుందని ముందుగానే ఉహించిన పోలీసులు.. హారిక కారును వెనక్కి పంపేశారు. అయితే హారిక మాత్రం.. పోలీసుల ఆంక్షలు లెక్క చేయకుండా.. ముందుకు వచ్చారు. ఆ సమయంలో హారిక భర్త పోలీసులతో పాటు టీడీపీ శ్రేణులతో బూతులతో రెచ్చిపోయారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన టీడీపీ శ్రేణులు.. హారిక కారును అడ్డుకునే యత్నం చేశారు. అయితే నాటి నుంచి వైసీపీ నేతలు బీసీ మహిళపై దాడి చేశారంటూ కులం కార్డు బయటకు తీశారు. ఇక ఇదే విషయంపై జగన్ ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని.. వైసీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని మళ్లీ పాత పాటే పాడారు. తప్పుడు కేసులతోనే నందిగాం సురేష్, వంశీ, చెవిరెడ్డి, కాకాణిని అరెస్టు చేశారని.. ఇప్పుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కూడా తప్పుడు కేసులు పెట్టారన్నారు జగన్. అయితే ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపురెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాత్రం కనీసం నోరు ఎత్తలేదు. ఈ వ్యాఖ్యలను హైకోర్టు కూడా తప్పుబట్టింది. ఇంకా చెప్పాలంటే చీవాట్లు పెట్టింది. అయినా సరే.. నల్లపురెడ్డిని జగన్ వెనకేసుకుని వచ్చారు.
Also Read : మేము లోంగిపోతాం.. మావోయిస్ట్ పార్టీ అగ్ర నేతల సమాచారం
ఇక తాను మళ్లీ అధికారంలోకి వస్తా అంటూ అదే పాత పాట పాడారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా శ్రేణులపై కూడా తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని.. ఇదొక విష సంస్కృతి అన్నారు. మూడేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందని.. ఇలాంటి పనులే తాము కూడా చేస్తే మీ పరిస్థితి ఏమిటీ అంటూ బెదిరింపు ధోరణి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సమావేశం పెట్టుకుంటే.. నేతలందరిపైన కేసులు పెట్టారని.. ప్రజాస్వామ్యంలో ఉన్నామా.. లేక ఎక్కడైనా ఉన్నామా అని ప్రశ్నించారు. తాను ఎంతో నిజాయతీగా వ్యవహరించానని… తన ప్రభుత్వంలో ఇలాంటి తప్పుడు కేసులు పెట్టలేదన్నారు. అయితే చంద్రబాబు సహా లోకేష్, అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల, దేవినేని ఉమా, నారాయణ వంటి నేతలపై పెట్టిన కేసులేమిటనే ప్రశ్నకు జగన్ జవాబు చెప్పలేదు. బీహార్‌లో ఉన్నామా.. ఆటవిక రాజ్యంలో ఉన్నామా అని ప్రశ్నించిన జగన్.. తాను అధికారంలో ఉన్నప్పుడు అమరావతి మహిళా రైతులపై పెట్టిన కేసుల గురించి, వారిపై జరిగిన దాడుల గురించి కూడా సమాధానం చెప్పాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
Also Read : ఆ విషయంలో జగన్ స్టాండ్ ఏమిటో..?
తప్పుడు వాంగ్మూలంతో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్న జగన్.. గతంలో తన పాలనలో జరిగిన అక్రమాలపై కూడా జవాబు చెప్పాల్సి ఉంది. ప్రస్తుతం చంద్రబాబు తప్పుడు సంప్రదాయం విష వృక్షం అవుతుందని.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి చర్యగా వీళ్లు కూడా ఇదే చేస్తే పరిస్థితి ఏమిటని పరోక్షంగా హెచ్చరించారు జగన్. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసుల గుడ్డలుడదీస్తా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత సప్త సముద్రాల అవతల ఉన్నా చొక్కా పట్టుకుని వచ్చి జైలులో వేస్తా అన్నారు. తాజాగా చంద్రబాబు వయసుపై మరోసారి విమర్శలు చేశారు. గట్టిగా కళ్లు మూసుకుంటే మరో మూడేళ్లలో చంద్రబాబు నాయుడు ఎగిరిపోతాడు.. అంటూ జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక రప్పా రప్పా డైలాగ్‌ను ప్రదర్శించడంపై మరోసారి జగన్ సమర్థించుకున్నారు సినిమా డైలాగ్‌ను పోస్టర్‌గా పెట్టినందుకే తమ పార్టీకి చెందిన ఇద్దరు అభిమానులను పోలీసులు రిమాండ్ చేశారని.. అలా అయితే.. సెన్సార్ చేసి సినిమాలో డైలాగ్ లేకుండా చేయాలన్నారు. మంచి పాటలను పాడినా కేసులు పెడతారా అంటూ రప్పా రప్పా నరుకుతాం అనే డైలాగ్‌లో ఎలాంటి తప్పు లేదన్నారు జగన్. మొత్తానికి మరో మూడేళ్ల తర్వాత తాను తిరిగి అధికారంలోకి వస్తానని.. అప్పుడు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ఇప్పుడు పదవిలో ఉన్న అధికారులపై చర్యలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.