ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సరే అధికారంలోకి వచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన భారతీయ జనతా పార్టీల కూటమిపై ప్రజల్లో ఆగ్రహం ఉందనే విషయాన్ని ఆయన పదే పదే మాట్లాడుతున్నారు. ఇక ఇదే సమయంలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకత్వాన్ని కూడా సిద్ధం చేస్తున్నారు వైయస్ జగన్. క్షేత్ర స్థాయి పర్యటనకు కూడా జగన్ వెళ్లేందుకు మరోసారి సిద్ధమవుతున్నారు. 2014 నుంచి 19 వరకు పార్టీని బలోపేతం చేసే విషయంలో జగన్ పక్కా లెక్కలతో ముందుకు వెళ్లారు.
Also Read : ఏపీలో మరో పదవుల సందడి.. వాళ్ళకే పెద్ద పీట…!
ఇప్పుడు కూడా అవే లెక్కలతో ఆయన అడుగులు వేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు సీనియర్ నాయకులను నమ్ముకున్న వైయస్ జగన్ త్వరలోనే నాయకులను మార్చే అవకాశం కనబడుతోంది. అన్ని జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశాలు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అనామకులకు నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వడానికి జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ప్రధానంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలను జగన్ దృష్టిలో పెట్టుకుంటున్నారు.
ఏ నియోజకవర్గాల్లో అయితే కూటమి అగ్రకుల నాయకత్వం ఉందో అక్కడ వెనుకబడిన వర్గాల నాయకత్వాన్ని రంగంలోకి దించేందుకు జగన్ రెడీ అవుతున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఎన్టీఆర్ అమలు చేసిన రాజకీయ వ్యవహారాన్ని ఇప్పుడు జగన్ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని వెనుక ఉండి నడిపించే విధంగా జగన్ పధక రచన చేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా జగన్ బీసీ నేతకు ఇవ్వనున్నారట. అవసరమైతే ఆయా నాయకులకు ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా నిలబడే విధంగా జగన్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read : ఏపీలో మరో అధికారిపై ఏసీబీ కేసు నమోదు..!
అనామకులకు సీట్లు ఇవ్వడం అలాగే వెనుకబడిన వర్గాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు బలమైన మార్గాలను జగన్ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర పార్టీలలో అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న వారిని కూడా ఇప్పుడు వైసీపీ ఆకర్షించేందుకు రెడీ అవుతోంది. అసంతృప్తిగా ఉన్న నేతల జాబితాను కూడా జగన్ ఎప్పటికప్పుడు తెప్పించుకుంటున్నారు. అవసరమైతే మండల స్థాయి నాయకులకు నియోజకవర్గ స్థాయి బాధ్యతలు అప్పగించేందుకు కూడా జగన్ వెనుకడుగు వేయడం లేదు.