ఒకప్పుడు ఏపీ రాజకీయాల్లో దేవినేని కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఉండేది. రెండు పార్టీల్లో దేవినేని కుటుంబానికి పట్టు ఉండేది అనే మాట అక్షరాలా నిజం. కాంగ్రెస్ లో దేవినేని నెహ్రూ, టీడీపీలో ఉమా… కీలక నేతలుగా చక్రం తిప్పారు అప్పట్లో. అయితే మరణించే కొన్ని నెలల ముందు దేవినేని నెహ్రూ టీడీపీ తీర్ధం పుచ్చుకోగా… ఆ తర్వాత ఆయన కుమారుడు దేవినేని అవినాష్ కు తెలుగు యువత బాధ్యతలతో పాటుగా… గుడివాడ సీటు ఇచ్చారు. పార్టీ ఓటమి తర్వాత ఆయన పార్టీ మారడం, పార్టీ పై, పార్టీ నాయకత్వం పై మరియు పార్టీ కార్యాలయం పై కొన్ని దాడులు, విమర్శలు చేయడం జరిగాయి.
అవినాష్ మొన్నటి ఎన్నికల్లో 50 వేలకు పైచిలుకు ఓట్లతో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అవినాష్ మాట్లాడినా పెద్దగా మీడియాలో ప్రాధాన్యత ఉండటం లేదు. దానికి తోడు కేసుల భయంతో ఆయన మీడియా ముందుకు కూడా పెద్దగా రావడం లేదు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కంటే ఎక్కువగా చక్రం తిప్పిన అవినాష్ ఇప్పుడు ప్రాభవం కోల్పోయారు అనిపిస్తుంది. ఓ సారి ఎంపీ, రెండు సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఆయన రాజకీయ జీవితానికి ఎదురు దెబ్బ. వచ్చే ఎన్నికల్లో ఆయన ఖచ్చితంగా గెలవకపోతే మాత్రం రాజకీయంగా నెహ్రూ వారసత్వ ప్రస్థానం ముగిసినట్టే.
Also Read : నేడే టీడీపీ కీలక సమావేశం, ఏం జరుగుతోంది…?
ఇక దేవినేని ఉమా విషయానికి వస్తే… గత ఎన్నికల్లో ఆయనకు సీటు రాలేదు. మైలవరం నియోజకవర్గం నుంచి వసంత కృష్ణ ప్రసాద్ కు సీటు ఇచ్చారు. ఇప్పుడు ఉమా ప్రభుత్వంలో గాని, కార్పోరేషన్ లో గాని ఏదోక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ గాని, ఆర్టీసీ చైర్మన్ గా గాని ఏదోక పదవి వస్తుందని ఆశించారు. కాని ఏ పదవి దక్కే అవకాశం కనపడటం లేదు. విజయవాడ వరదల్లో ఉమా ఎక్కువగానే కష్టపడ్డారు. బుడమేరు గండి వద్ద… మంత్రి నిమ్మలతో కలిసి వర్షంలో కూడా పని చేసారు. కానీ అధినేత ఆశీసులు మాత్రం దక్కలేదు. భవిష్యత్తు ప్రకటనల్లో ఆయన పేరు ఉంటుందని పరిశీలకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రెండో విడతలో కూడా పదవి దక్కకపోతే దేవినేని ఉమా ప్రస్థానం కూడా రాజకీయాల్లో దాదాపుగా ముగిసినట్టే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇలా రెండు వైపుల నుంచి దేవినేని కుటుంబం కష్టాలే పడుతోంది.