ఇరాన్ – ఇజ్రాయిల్ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో.. ఇరాన్ వేస్తున్న అడుగులు ఇప్పుడు ప్రపంచ దేశాలను భయపెడుతున్నాయి. ముఖ్యంగా ఓ జలసంధి విషయంలో ఇరాన్ తీసుకునే నిర్ణయంపై ఆందోళన నెలకొంది. ఆయిల్ రవాణాలో కీలకంగా ఉన్న హార్ముజ్ జలసంధిని మూసివేయాలనే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ ఆమోదించడం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఇప్పటికే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి.
Also Read : తొక్కిసలాట.. కర్ణాటక ప్రభుత్వం సంచలన బిల్
జలసంధిని మూసివేస్తే చమురు ధరలను పెరిగే అవకాశం ఉంది. భారత్ పై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్లమెంట్ ఆమోదించిన నేపధ్యంలో.. తుది నిర్ణయం ఆ దేశ సుప్రీం జాతీయ భద్రతా మండలిదే. గత వారాంతంలో ఇరాన్‌లోని కీలకమైన అణు కేంద్రాలపై అమెరికా భారీ వైమానిక దాడులు నిర్వహించిన కొద్దిసేపటికే ఈ ప్రతిపాదన వెలుగులోకి వచ్చింది. అమెరికా దాడుల ఫలితంగా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచ చమురు సరఫరాలకు అంతరాయం ఏర్పడుతుందనే భయాలు తలెత్తాయి.
Also Read : ట్రంప్ కు ఇరాన్ వార్నింగ్.. మా రియాక్షన్ కు రెడీగా ఉండు
హార్ముజ్ జలసంధి పర్షియన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలిపే ఇరుకైన జలమార్గం. ఇది ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాలలో ఒకటి. ప్రపంచ ముడి చమురులో దాదాపు 20% ఈ జలసంధి గుండా వెళుతుంది. ఈ మార్గానికి ఏదైనా అంతరాయం ఏర్పడితే చమురు ధరలు గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలపై, ముఖ్యంగా భారత్ వంటి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడిన దేశాలపై ప్రభావం పడే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల అమెరికా దాడుల అనంతరం కాస్విస్డమ్ లేక్, సౌత్ లాయల్టీ అనే రెండు సూపర్ ట్యాంకర్లు జలసంధి గుండా వెళుతుండగా అకస్మాత్తుగా యు-టర్న్ చేసాయని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది. ఇటువంటి చర్యలు సాధారణమే అయినా.. ఈ ప్రాంతంలోని ఓడల భద్రత గురించి షిప్పింగ్ పరిశ్రమలో ఆందోళన పెరుగుతోంది.




