నవంబర్ 15వ తేదీ కోసం సినీ పరిశ్రమ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తోంది. ఇంకా చెప్పాలంటే.. టాలీవుడ్‌తో పాటు తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ పరిశ్రమలతో పాటు హాలీవుడ్ కూడా ఈ తేదీ కోసం వెయిటింగ్. ఇందుకు ఏకైక కారణం.. ఆ రోజు కొత్త సినిమా పేరుతో పాటు సినిమా ఎలా ఉంటుందో చెప్పేందుకు గ్లిమ్స్ కూడా రిలీజ్ చేయనున్నారు. ఇంతకు అది ఏ సినిమా అనుకుంటున్నారా.. సిల్వర్ స్క్రీన్ జక్కన్న రాజమౌళి, ప్రిన్స్ మహేశ్ బాబు కాంబినేషన్లో వస్తున్న కొత్త సినిమా. రాజమౌళి కెరీర్లో తక్కువ సమయంలో పూర్తి చేసిన సినిమా కూడా ఇదే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి లీక్ బయటకు రాలేదు. ఓ రెండు, మూడు ఫోటోలు తప్ప.. సినిమాలో నటీనటులు ఎవరనే విషయం కూడా ఇప్పటి వరకు బయటపెట్టలేదు.
Also Read : జోగి.. కేరాఫ్ కులం కార్డు..!
రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఆస్కార్ గెలిచిన తర్వాత జక్కన్న రేంజ్ హాలీవుడ్ వరకు చేరుకుంది. ఇప్పటికే బాహుబలి డైరెక్టర్ అంటూ జక్కన్నకు సినీ వర్గాలు నీరాజనం పలుకుతున్నాయి. ఇదే సమయంలో ప్రిన్స్ మహేష్‌తో కలిసి ఏకంగా 12 వందల కోట్లతో సినిమా అనే మాట.. పెద్ద దుమారం రేపుతోంది. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ మాదిరిగా పాత కథే ఎన్నుకుంటారా.. లేక ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కొత్త తరాన్ని దృష్టిలో పెట్టుకున్న కథా.. అనే ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఇక ప్రస్తుత ట్రెండ్‌కు తగినట్లుగా ఆధ్యాత్మికతను జోడించిన కథలో ప్రిన్స్ మహేష్ కనిపించనున్నారా అనేది ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద టాక్.
Also Read : అమరావతి పనుల్లో పురోగతి ఉందా..?
ఈ సినిమా గురించి బిగ్ అప్డేట్ ఇప్పుడు మరింత ఆసక్తిగా మారింది. ఈ నెల 15న హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో సినిమా పేరు, నటీనటుల వివరాలు బయటకు రానున్నాయి. జక్కన్న అంటేనే.. మార్కెటింగ్ కింగ్. నిజానికి ఈ సినిమా గురించి ఇప్పటి వరకు ఎలాంటి లీకులు లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ ఎప్పుడనేది తెలియకపోయినా.. పబ్లిసిటీని మాత్రం ఇప్పటి నుంచే ప్రారంభించారు. జియో హాట్‌స్టార్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన తొలి ఫంక్షన్‌ను లైవ్ టెలీకాస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని జియో అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ వేడుకకు జేమ్స్ కామెరన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు వస్తారనే మాట కూడా వినిపిస్తోంది. దీంతో ఈ వేడుక కోసం సినీ ప్రముఖులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి రెండు మూడు టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. వారణాసి, త్రిశూల్, జై హింద్ అనే టైటిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. మరి జక్కన్న ఏ టైటిల్ పెట్టారో తెలియాలంటే.. మరో పది రోజులు ఆగాల్సిందే.

