జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి జరిగిన వెంటనే.. గంటల వ్యవధిలో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తామని కేంద్రం ప్రకటన చేసింది. మరి నిజంగా ఒప్పందం రద్దు చేయడం సాధ్యమా..? ఖచ్చితంగా అసాధ్యం అంటున్నారు నిపుణులు. అడ్డుకుంటే భారత్ వరదల రూపంలో తీవ్రంగా నష్టపోతుందని హెచ్చరిస్తున్నారు. సింధు, జీలం, చీనాబ్ నదీ జలాల్లో 80 శాతం పాకిస్తాన్‌కు కేటాయింపులు జరిగాయి. జూన్ నుండి సెప్టెంబర్ మాసం వరకు ఉండే వర్షా కాలంలో.. ఈ నదుల్లో ప్రవాహం తీవ్రంగా ఉంటుంది.
Also Read : బెజవాడ జైల్లో వీఐపీ సందడి.. వంశీ టూ పీఎస్ఆర్
దానికి తోడు.. మంచు కరిగే ప్రవాహాలు కూడా ఎక్కువ. హిమాలయాల నుంచి వచ్చే చిన్న చిన్న జలపాతాలు ఈ నదిలో కలుస్తాయి. గ్లేషియర్లు కరిగిన సమయంలో కొండపలపై నుంచి బురద, మట్టి ఎక్కువగా ఈ నదుల్లోకి కొట్టుకుని వస్తాయి. కాబట్టి.. ఆ సమయాల్లో ఈ భారీ నీటి ప్రవాహాలను ఆపడం అసాధ్యం అనే అభిప్రాయం ప్రధానంగా వినపడుతోంది. ఈ జలాలను నిల్వ చేయాలంటే.. ఖచ్చితంగా భారీ రిజర్వాయర్లు కావాలి. బురద ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. వాటిని నిర్మించిన అనంతరం నిర్వహణ కూడా కష్టమే.
Also Read : ఎవరు ఓడినా ఇంటికే.. ఐపీఎల్ లో కీలక మ్యాచ్
ఆ నీటిని నిల్వ చేయకుండా పెద్ద ఎత్తున కాల్వల ద్వారా మళ్ళించే ప్రయత్నం చేయాలి. మన దేశంలో.. కీలక నదులపై ఎక్కువగా హైడ్రో పవర్ ప్రాజెక్టులు మాత్రమే నిర్మించారు. భారీగా నీటిని నిల్వ చేసే ప్రాజెక్టును ఏ నది మీదా ఇప్పటి వరకు నిర్మించలేదు. ఈ తరహా హైడ్రో పవర్ ప్రాజెక్టులు నీటిని నిల్వ చేసేందుకు కాకుండా టర్బైన్లను తిప్పడానికి, విద్యుత్ ఉత్పత్తి చేయడానికి మాత్రమే నీటి ప్రవాహాన్ని వాడుకుంటాయి. అసలు ఒప్పందం ప్రకారం కూడా.. సింధు, జీలం, చీనాబ్ నదుల్లో 20 శాతం నీటిని వాడుకునేందుకు మన దేశంలో సరైన మౌలిక వసతులు లేవు అనే ఆరోపణ కూడా ఉంది.
Also Read : రాహుల్ కు బోర్డు బంపర్ ఆఫర్..?
ఇన్నేళ్ళలో ఒక్క నీటి నిల్వ ప్రాజెక్ట్ కూడా నిర్మించలేదు. ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ అనుమతి లేకుండా భారత్.. నిర్మించుకునే అవకాశం ఉన్నా సరే దేశ విభజన అనంతరం ఆ ప్రయత్నాలు జరగలేదు. భౌగోళికంగా కఠినమైన భూభాగం సింధూ నది పరివాహక ప్రాంతంలో ఉంది. అక్కడి స్థానికులు కూడా ప్రాజెక్ట్ లపై అసహనం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్నారు. అందుకే నీటి నిల్వ ప్రాజెక్ట్ లు ముందుకు వెళ్ళడం లేదనే వాదన సైతం ఉంది. 2016లో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి తర్వాత.. ఈ ప్రాంతంలో ఆనకట్టలు, రిజర్వాయర్లను నిర్మిస్తామని, వేగవంతం చేస్తామని చెప్పినా అడుగులు పడలేదు. దానికి తోడు ఆ నీటిని నిల్వ చేసే ప్రయత్నం చేసినా.. వరదల కారణంగా భారత్ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ. క్లౌడ్ బరస్ట్ ప్రభావం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో వరదలు వస్తే ప్రాణ నష్టం తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. సింధు, ఇతర నదుల మీద భారత్ నిర్మించిన డ్యామ్‌లు పాకిస్తాన్ సరిహద్దుకు చాలా దూరంగా ఉండటంతో.. ఆ నీటిని విడుదల చేసినప్పుడు బురదతో ఎక్కువగా భారత్ ప్రభావితం అవుతుంది.