గత వైసీపీ హయాంలో అధికారులు, రాజకీయ నాయకులు… ఏ విషయంలో కూడా అక్రమ సంపాదన విషయంలో వెనక్కు తగ్గలేదు. తాజాగా ఓ అక్రమ విషయం వెలుగులోకి వచ్చింది. ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు – వాటిల్లో ఒకటి ఓ ఐఏఎస్ అధికారి భార్య వాడుతున్నట్లు గుర్తించారు. గతంలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు అత్యంత ఖరీదైన బీఎండబ్ల్యూ కార్లు మాయమైపోయాయనే ఆరోపణలు వచ్చాయి. వీటిల్లో ఒకటి 2017 నవంబరులో అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయించింది అప్పటి ప్రభుత్వం.
అప్పట్లో ఆ పదవిలో అనంతరాము ఉండగా… అనంతరాము తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అయితే ప్రస్తుతం ఆ వాహనం ఎక్కడుందో? ఎవరి వద్ద ఉందో? అసలు ఉందో లేదో, ఎవరు వినియోగిస్తున్నారో తమకేం తెలియదంటూ అటవీశాఖ అధికారులు చెప్పడం గమనార్హం. అప్పట్లో కేటాయించిన వాహనం ఏమైందో, ఎక్కడుందో వివరాలు తెలియజేయాలంటూ అటవీ దళాల అధిపతి (PCCF) కార్యాలయం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి తాజాగా లేఖ రాసింది.
Also Read : కవిత మౌనం.. రాజకీయ వ్యూహమా?
మరోవైపు ఆ బీఎండబ్ల్యూ కారును కీలక స్థానంలో ఉన్న ఓ ఐఏఎస్ అధికారి భార్య హైదరాబాద్‌లో వినియోగిస్తున్నట్లు అటవీశాఖ ఉద్యోగుల్లో పెద్దఎత్తున చర్చ మొదలయింది. దీనితో ఈ అంశంపై రిపోర్ట్ ఇవ్వాలని అటవీ శాఖా మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 414/2017కు సంబంధించిన కేసులో ఓ ఎర్రచందనం స్మగ్లర్ నుంచి టీఎన్ 05 బీహెచ్ 3303 నంబరు బీఎండబ్ల్యూ కారును అటవీ అధికారులు సీజ్ చేయగా… ప్రభుత్వ స్వాధీనం (కాన్ఫిస్‌కేట్) కాకముందే ఆ వాహనాన్ని 2017 డిసెంబరు 11వ తేదీన అటవీశాఖ ముఖ్య కార్యదర్శికి కేటాయిస్తూ అప్పటి అటవీ దళాల అధిపతి ఉత్తర్వులు జారీ చేసారు.
ప్రస్తుతం అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరామ్ అప్పట్లోనూ ఆ పోస్టులోనే ఉన్నారు. 2019 జూన్ వరకూ అనంతరామ్ ఆ బాధ్యతల్లో కొనసాగారు. అనంతరాము తర్వాత 2019 జూన్ నుంచి 2020 అక్టోబరు వరకూ, మళ్లీ 2022 ఫిబ్రవరి నుంచి 2024 జూన్ వరకూ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అటవీశాఖ ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. నీరబ్‌కుమార్ ప్రసాద్ తర్వాత మళ్లీ అనంతరాము ఆ పోస్టులోకి వచ్చి ప్రస్తుతం కొనసాగుతున్నారు.
Also Read : వర్మని ప్రభుత్వం క్షమిస్తే.. ప్రజలు టిడిపిని క్షమిస్తారా?
వీరితో పాటు గతంలో సీఎస్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్ దాస్, పదవీ విరమణ చేసిన మరో అధికారి జీఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్ కూడా కొంతకాలం ఈ పోస్టులో కొనసాగగా… అయితే ఆ బీఎండబ్ల్యూ కారు ఎక్కడుందనేది అధికారికంగా అటవీశాఖకు సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దీనిపై నివేదిక ఇవ్వాలని పీసీసీఎఫ్‌ను (Principal Chief Conservator of Forest) తాజాగా ఆదేశించారు. ఇదే టైంలో మరో బీఏండబ్ల్యూ కారు కూడా మిస్ అయింది.
పుత్తూరు అటవీ రేంజ్ పరిధిలో ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ 18కే 2277 బీఎండబ్ల్యూ బ్లూ కలర్ వాహనాన్ని 2015 ఫిబ్రవరిలో అప్పటి అటవీశాఖ మంత్రి అదనపు ప్రైవేటు కార్యదర్శికి కేటాయించగా… ఆ కారు గురించి కూడా అటవీ అధికారులకు అధికారిక సమాచారం ఇవ్వలేదు. టయోటా ఇన్నోవా కారుది కూడా దాదాపు అదే పరిస్థితి. తమిళనాడుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న టీఎన్ 07 సీబీ 3724 టయోటా ఇన్నోవా వాహనాన్ని 2023 జులైలో అప్పటి అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్‌కు కేటాయించగా… అయితే ప్రస్తుతం ఆ కారు ఎక్కడుందనేది అటవీశాఖకు అధికారిక సమాచారం లేకపోవడం గమనార్హం.