పట్టుమని పది నెలలు కూడా పూర్తి కాకుండానే కూటమి సర్కార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ జీవీ రెడ్డి కూటమి ప్రభుత్వానికి షాక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవికి కూడా జీవీ రెడ్డి రాజీనామా చేశారు. పదవి చేపట్టి కనీసం ఐదు నెలలు కూడా పూర్తి కాకుండానే పదవికి రాజీనామా చేయడం పెద్ద ఎత్తున కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసిన జీవీ రెడ్డి… ఈ రోజు తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. “వ్యక్తిగత కారణాలతో తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం, జాతీయ అధికార ప్రతినిధి హోదా, ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పదవుల నుంచి రాజీనామా చేస్తున్నట్లు లేఖ రాశారు.
Also Read : ఆ ఇద్దరిలో ఎవరికి ముందు.. ఎవరికి ప్రాధాన్యత..?
మీరు నాపై ఉంచిన విశ్వాసానికి, అందించిన మద్దతుకు, నాకు ఈ కీలకమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ మరింత బలంగా ఎదిగి ప్రజాసేవలో ముందుండాలని ఆకాంక్షిస్తున్నాను. ఇక మీదట పూర్తిగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతాను. భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీలో చేరే ఉద్దేశం లేదు.” అంటూ చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. అయితే జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం వెనుక పెద్ద కారణమే ఉందనేది బహిరంగ రహస్యం. ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి జీవీ రెడ్డి దూకుడుగానే వ్యవహరించారు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో జరిగిన అక్రమాలను వెలికి తీశారు. నాటి నుంచి ఫైబర్ నెట్ సంస్థలో అక్రమంగా కొనసాగుతున్న ఉద్యోగులపై వేటు వేశారు.
Also Read : బిజెపిలో ఆ ఇద్దరే దొంగలు.. రేవంత్ సంచలన కామెంట్స్
తొలి విడతలో ఏకంగా 410 మందిని తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. రెండో విడతలో 200 మందిపై వేటు వేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో ఫైబర్ నెట్ పేరుతో కోట్ల రూపాయలను వైసీప నేతలు అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. వ్యూహం సినిమా కోసం అక్రమ చెల్లింపులు చేశారని వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మకు నోటీసులు కూడా జారీ చేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా వెనుక ప్రధానంగా ప్రభుత్వ పెద్దల పై అసంతృప్తి ఉందనే మాట వినిపిస్తోంది. ఒక సంస్థ ఛైర్మన్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేస్తే… దానిని ఎండీ అమలు చేయలేదు. పైగా 2, 3 నెలలు అక్రమార్కులకు వేతనాలు కూడా చెల్లించారు. ఇక ఆదాయం విషయంలో కూడా ఛైర్మన్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయటం లేదని ఎండీ దినేష్ కుమార్ పై జీవీ రెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. చివరికి ఛైర్మన్, ఎండీ మధ్య వివాదం ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు చేరుకుంది.
Also Read: ఆ విషయంలో అంతా ఫెయిల్..!
ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లో వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రిని కూడా సీఎం ఆదేశించారు. ఆధారాలు సమర్పించాలని మంత్రి కూడా ఛైర్మన్, ఎండీని ఆదేశించారు. అయితే జీవీ రెడ్డి చేసిన ఆరోపణలను ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేశారు. దీంతో జీవీ రెడ్డితో మాట్లాడిన చంద్రబాబు వివాదాలకు పోకుండా ఎండీ దినేష్ కుమార్‌తో కలిసి పని చేయాలని సూచించారు. అక్కడ సరే అని చెప్పిన జీవీ రెడ్డి… తీవ్ర మనస్థాపానికి గురైనట్లు తెలుస్తోంది. రెండు రోజుల పాటు తన అనుచరులతో చర్చించిన జీవీ రెడ్డి… చివరికి ఛైర్మన్ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీని పై పార్టీ అధిష్టానం కూడా ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తుంది. సమస్యలు ఉంటే మీడియాతో కాకుండా ముందు పార్టీలో లేక ప్రభుత్వంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని, మీడియాకు ఎక్కడ వలన పార్టీకి చెడ్డపేరు వచ్చిందని పేర్కొన్నట్లు సమాచారం. ఏది ఏమైనా పార్టీకి ఒక హెచ్చరిక లాంటిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.