గత కొన్నాళ్ళుగా వైసీపీకి మాజీ మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ గుడ్ బై చెప్తారనే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. గత రెండు నెలల నుంచి ఆమె టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం ఊపందుకుంది. అయితే తాజాగా ఆమె వైయస్ఆర్ సీపీకు రాజీనామా చేస్తూ మీడియాకు ఓ లేఖ విడుదల చేసారు. “పార్టీలో కష్టపడిన వారి కోసం ఇప్పుడు జగన్ గారు ‘గుడ్ బుక్’, ప్రమోషన్లు అంటున్నారు. నాయకులు, కార్యకర్తల కోసం ఉండాల్సింది ‘గుడ్ బుక్’ కాదు “గుండె బుక్”. వారికి ప్రమోషన్ పదం వాడటానికి రాజకీయపార్టీ వ్యాపార కంపెనీ కాదు అంటూ కౌంటర్ ఇచ్చారు.
జీవితాలు, ప్రాణాలు పెట్టిన కార్యకర్తలు అవసరం లేదు అనుకునే జగన్ గారు ‘గుడ్ బుక్’ పేరుతో మరోసారి మోసం చెయ్యడానికి సిద్ధపడుతున్నారని ఆమె మండిపడ్డారు. పార్టీని నడిపించడంలో జగన్ గారికి బాధ్యత లేదని… పరిపాలన చేయడంలో బాధ్యత లేదు అని… సమాజం పట్ల అంతకన్నా బాధ్యత లేదంటూ ఫైర్ అయ్యారు. అప్రజాస్వామిక పద్ధతులు, నియంతృత్వ ధోరణులు ఉన్న నాయకుడుని ప్రజలు మెచ్చుకోరని ఈ ఎన్నికల తీర్పు స్పష్టం చేసిందని ఆమె పేర్కొన్నారు. వ్యక్తిగతంగా, విధానాలపరంగా అనేక సందర్భాల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ ఒక నిబద్ధత కలిగిన నాయకురాలిగా పార్టీలో పనిచేసాను అంటూ గుర్తు చేసుకున్నారు.
Also Read : ఏపీలో లోకేష్ రెడ్ బుక్ ఇన్ యాక్షన్
ప్రజాతీర్పు తర్వాత అనేక విషయాలు సమీక్షించుకుని అంతర్మధనం చెంది వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నానని తెలియజేస్తున్నానని ఆమె తెలిపారు. అయితే ఇప్పుడు ఆమె ఏ పార్టీలో జాయిన్ అవుతారనే దానిపై చాలా చర్చలే జరుగుతున్నాయి. తెలుగుదేశం పార్టీపై సిఎం చంద్రబాబుపై గతంలో ఆమె తీవ్ర ఆరోపణలు చేసారు. దీనితో టీడీపీలోకి ఆమె వచ్చినా ఆమెను ఎంత వరకు తీసుకుంటారు అనేది స్పష్టత రావడం లేదు. అయితే జనసేనలో ఆమె జాయిన్ అయ్యే అవకాశం కనపడుతోంది. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆమెకు ఉప ముఖ్యమంత్రి పవన్ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.