ఆంధ్రప్రదేశ్ లో ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలపై పెద్ద చర్చే జరుగుతోంది. మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య, బీదా మస్తాన్ రావు తమ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామాలు చేయగా వారి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో ఆయా స్థానాలకు అభ్యర్ధులు ఎవరు అనే దానిపై మాత్రం స్పష్టత రావడం లేదు. జనసేన నుంచి నాగబాబు స్థానం దాదాపుగా ఖరారు అయింది. అలాగే బిజెపి నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని ఖరారు చేసింది రాష్ట్ర బిజెపి అధిష్టానం. కూటమి ప్రభుత్వంలో ఉన్న మూడు పార్టీలు తలా ఒక స్థానం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.
Also Read : రిమాండ్ రిపోర్ట్ తో విజయ్ పాల్ కి ఉచ్చు బిగించిన పోలీసులు
బిజెపి, జనసేన నుంచి అభ్యర్థులు దాదాపు ఖరారు కాగా… తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయం పై క్లారిటీ లేదు. టీడీపీ నుంచి ఓ కీలక నేత పేరు ప్రధానంగా వినపడుతోంది. గుంటూరు మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ను అధిష్టానం ఖరారు చేసినట్టు వార్తలు వస్తున్నాయి. గల్లా జయదేవ్… రెండు పర్యాయాలు గుంటూరు ఎంపీగా సేవలు అందించారు. పార్లమెంట్ లో సుదీర్ఘ ప్రసంగాలు, రాష్ట్ర సమస్యలపై మాట్లాడిన అనుభవం ఉంది. ఢిల్లీ స్థాయిలో మంచి పరిచయాలు ఉన్నాయి. అలాగే పారిశ్రామిక రంగంలో కూడా గల్లా జయదేవ్ కు మంచి పరిచయాలు ఉండటంతో చంద్రబాబు ఆయనపై మొగ్గు చూపుతున్నారు.
Also Read : టార్గెట్ వంశీ.. ముహూర్తం ఫైనల్
అయితే ప్రధాని నరేంద్ర మోడీ… జయదేవ్ ను అంగీకరిస్తారా లేదా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. ప్రధానిపై అప్పట్లో జయదేవ్.. పార్లమెంట్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటూ ఘాటుగా మాట్లాడారు. జయదేవ్ ప్రత్యక్ష రాజకీయాల నుంచి విరామం తీసుకోవాలి అనుకున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పై మరియు కేంద్ర సంస్థల పై కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరి మోడీ ఆయనను అంగీకరిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. గల్లా జయదేవ్ ఢిల్లీలో కావాలని చంద్రబాబు కూడా పట్టుదలగా ఉండటంతో దాదాపుగా ఆయన అభ్యర్ధిత్వం ఖరారు అయినట్టే తెలుస్తోంది. ఈ ముగ్గురు రాజ్యసభ ఎంపీల్లో ఒకరికి కేంద్ర మంత్రి పదవి కూడా ఖరారు చేసే సూచనలు కనపడుతున్నాయి.