తెలంగాణలో ఇప్పుడు ఎక్కడా చూసినా ఒకటే అంశంపైన చర్చ జరుగుతోంది. ఇంకా చెప్పాలంటే రచ్చ జరుగుతోంది. అదే మూసీ నది ప్రక్షాళన. మూసీ నదిని పూర్తిస్థాయిలో సుందరీకరణ చేస్తామని… దీని వల్ల అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి మరింత గుర్తింపు వస్తుందనేది రేవంత్ సర్కార్ మాట. అదే సమయంలో మూసీ నదిపైన ఆక్రమణలు తొలగిస్తామని ప్రకటించారు. నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ కూడా ఇస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి ఇళ్లు కూడా కేటాయించారు.
అయితే మూసీ ప్రక్షాళనపై అటు విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్ల రూపాయల దోపిడీ జరుగుతోందని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఢిల్లీకి భారీ ఎత్తున బహుమతులు తీసుకెళ్లేందుకే మూసీ ప్రక్షాళన పేరుతో డ్రామా ఆడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి మూసీ నది సుందరీకరణ అనే అంశం ఇప్పటిది కాదు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చిప్పుడే మూసీ నదిపైన చంద్రబాబు దృష్టి పెట్టారు. అయితే అప్పట్లో ఈ స్థాయిలో ఆదాయం లేకపోవడంతో… ప్రధానంగా ఐటీ పరిశ్రమ విస్తరణపైనే ఫోకస్ చేశారు. దీంతో ఈ ప్రాజెక్టు మూలన పడిపోయింది.
Read Also : ప్రకాశంలో జిల్లాలో రాజకీయ కుదుపు…!
ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దగా పట్టించుకోకపోయినప్పటికీ… వైఎస్ హయాంలో అప్పుడప్పుడూ ఈ మాట వినిపించింది. వైఎస్ మరణానంతరం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో… తెలంగాణలో, హైదరాబాద్‌లో కూడా ఇలాంటి వివాదాస్పద అంశాల జోలికి అప్పటి రోశయ్య, కిరణ్ సర్కార్‌లు పోలేదు.
ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో మూసీ సుందరీకరణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. మూసీ నదిని ప్రక్షాళన చేయడం ద్వారా హైదరాబాద్ నగరానికి తాగు నీటితో పాటు నల్గొండ జిల్లాకు సాగునీరు కూడా అందించవచ్చని కేసీఆర్ సర్కార్ లెక్కలు వేసింది. అయితే హైదరాబాద్ నగరానికి చెందిన సగానికి పైగా మురుగు మూసీ నదిలోనే కలుస్తుండటంతో పాటు పాతబస్తీ పరిధిలో పెద్ద ఎత్తున ఆక్రమణలు కూడా ఉన్నాయి. దీంతో దీని జోలికి వెళ్లేందుకు కేసీఆర్ సర్కార్ ధైర్యం చేయలేదనే చెప్పాలి.
అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టడంతో మూసీ ప్రక్షాళన పూర్తిగా పక్కన పడిపోయింది. అయితే రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా హైడ్రాను తెరపైకి తీసుకువచ్చారు. ఆ తర్వాత మూసీ ప్రక్షాళన అంశం… దీంతో తెలంగాణ మొత్తం హైడ్రా, మూసీ చుట్టే తిరుగుతోంది. చివరికి బీఆర్ఎస్, బీజేపీ నేతలు తెలంగాణలో ఇతర అంశాల జోలికి పోవడం లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లతోనే రోజులు గడిచిపోతున్నాయి. ప్రతిపక్షాలు ఇతర అంశాల జోలికి వెళ్లకుండా రేవంత్ భలే ప్లాన్ చేశాడనే మాట ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.