ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు టిడీఆర్ బాండ్ల వ్యవహారం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు భారీగా అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పుడు మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు సాక్ష్యాలను కూడా తీసుకువెళ్ళారు. త్వరలోనే దీనిపై అంతర్గత విచారణ జరిపి మాజీ మంత్రిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొందరు అధికారుల పాత్ర కూడా ఉందని గుర్తించారు. వీరిని కూడా విచారణ చేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
ఇక ఇదిలా ఉంచితే టిడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖతో అనుసంధానం చేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. సమావేశానికి మున్సిపల్ శాఖ డైరెక్టర్ హరి నారాయణన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ IG శేషగిరి బాబు, పట్టణ ప్రణాళిక విభాగం డైరెక్టర్ విద్యాలతా హాజరు అయ్యారు.
బాండ్ల జారీలో అక్రమాలకు తావు లేకుండా అవసరమైన చర్యలను రిజిస్ట్రేషన్ శాఖ తీసుకోవాలని సూచనలు చేసారు మంత్రి. టౌన్ ప్లానింగ్ విభాగం తో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను అందుబాటులోకి తీసుకు రావాలని భావిస్తున్నారు. సర్వే నెంబర్లు, ఈసీలు, ఓనర్ షిప్ డాక్యుమెంట్లు జారీ పారదర్శకంగా ఉండేలా సాంకేతికంగా ఏర్పాట్లు చేయనున్నారు అధికారులు. దీని ద్వారా అక్రమాలకూ చెక్ పెట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.