అగ్రరాజ్యాధినేత.. అమెరికా అధ్యక్షుడు.. రెండుసార్లు అధ్యక్షునిగా ఎన్నిక.. 8 యుద్ధాలు ఆపిన ఘనుడు.. డొనాల్డ్ ట్రంప్ ఆశలన్నీ నీరుగారిపోయాయి. ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి తనకే అని గొప్పగా చెప్పుకున్నారు. అసలు తనకు ఎందుకు ఇవ్వరూ.. అని కూడా ప్రశ్నించారు. గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ఎలా ఇచ్చారన్న ట్రంప్.. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 8 యుద్ధాలు ఆపాను నేను.. ఎంతో మంది జీవితాలు కాపాడాను.. కాబట్టి నాకే ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలన్నారు కూడా. ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించారు. కానీ ట్రంప్ ఆశలన్నీ గల్లంతు అయ్యాయి. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ శాంతి బహుమతిని వెనుజులాకు చెందిన మరియా కొరీనా మచాడోకు అందిస్తున్నట్లు అకాడమీ ప్రకటించింది.
Also Read : భారత్ పై తాలిబన్ల ప్రేమ, అభిమానం.. వైరల్ అవుతోన్న వీడియో
మరియా కొరీనా మచాడో.. నా దేశం తగలబడుతుంటే నేను ఇంట్లో ఎలా ఉంటాను అని గొప్పగా చెప్పిన వ్యక్తి. దాదాపు 25 ఏళ్ల క్రితమే మచాడో వెనిజులా ప్రజల స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. అక్కడ ప్రజలను చైతన్యపరిచారు. 2010లోనే జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వెనిజులా పరిస్థితిని ప్రపంచానికి చాటి చెప్పారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేశారు. దేశ ద్రోహం, కుట్ర వంటి కేసులను ఎదుర్కొన్నారు. దాదాపు ఏడాది కాలంగా ఆమె ఎక్కడ ఉన్నారో కూడా తెలియటం లేదు. ఈ ఏడాది జనవరిలో మరియాను సైన్యం అదుపులోకి తీసుకుంది. ఆ తర్వాత ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ఆమెను విడిచిపెట్టి.. సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కూడా. నాటి నుంచి ఇప్పటి వరకు మరియా కొరీనా మచాడో ఎక్కడ ఉన్నారనేది ఎవరికీ తెలియదు. కానీ ఆమె మాత్రం సోషల్ మీడియా ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ పోరాటం చేస్తూనే ఉన్నారు.
Also Read : పాక్ దారుణాలపై.. ఐరాసాలో పర్వతనేని హరీష్ సంచలన కామెంట్స్..!
ట్రంప్ విషయానికి వస్తే.. భారత్ – పాకిస్తాన్ మధ్య యుద్దం తనవల్లే ఆగిందని.. లేదంటే పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేవని ఇప్పటికే ఓ పది సార్లు ప్రకటించుకున్నారు. ఆపరేషన్ సిందూర్ తన వల్లే ఆగిందని పదే పదే చాటింపు వేసుకున్నారు. నిజానికి ఈ విషయాన్ని రెండు దేశాల ప్రతినిధులు ఇప్పటి వరకు ఖరారు చేయలేదు. పైగా ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత పన్ను పోటు బాగా ఎక్కువైంది. మరీ దారుణంగా పన్నులు పెంచారు. ఇటీవల H1 B వీసాలపై కూడా ఆంక్షలు విధించారు. స్వదేశీ, విదేశీ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరో అడుగు ముందుకు వేసిన ట్రంప్.. అమెరికన్ సంస్థల్లో అమెరికన్లే ఎక్కువగా ఉండాలని కూడా సూచించారు. వాస్తవానికి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత గన్ కల్చర్ పెరిగిపోయింది. రెండు రోజుల క్రితం కూడా భారతీయ రెస్టారెంట్ ఓనర్‌ను పాయింట్ బ్లాంక్‌లో దుండగుడు కాల్చి చంపాడు. దీంతో ప్రపంచమంతా ట్రంప్ విధానాలను తీవ్రంగా తప్పుబడుతోంది. అయినా సరే ట్రంప్ మాత్రం.. తానొక శాంతి దూత అని.. యుద్ధాలు ఆపానంటూ గొప్పలు చెప్పుకుంటున్నారు. నోబెల్ శాంతి బహుమతి తనకే ఇవ్వాలని వింత వాదన చేయడం పట్ల అమెరికన్లు కూడా నవ్వుకున్నారు.