సమయానికి ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి అత్యంత కీలకమని నిపుణులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ వస్తున్నారు. తాజాగా బ్రిటన్‌లోని మాంచెస్టర్ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో కూడా ఇదే విషయం స్పష్టమైంది. ముఖ్యంగా ఉదయం అల్పాహారం (బ్రేక్ ఫాస్ట్) ఆలస్యం చేయడం వల్ల ఆయుష్షు తగ్గే ప్రమాదం ఉందని ఈ పరిశోధనలో తేలింది.
3000 మందిపై నిర్వహించిన ఈ అధ్యయనంలో, బ్రేక్ ఫాస్ట్‌ను ఆలస్యంగా చేసే వారిలో ఆయుష్షు తగ్గుతున్నట్లు గుర్తించారు. మరోవైపు, మూడు పూటలూ సమయానికి ఆహారం తీసుకునే వారిలో 11 శాతం వరకు ఆయుష్షు పెరుగుతుందని తేలింది. రోజువారీ భోజనం సమయానికి చేయకపోతే ఎనిమిది నుంచి పది శాతం వరకు ఆయుష్షు తగ్గే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Also Read : ఆ కలర్ ఐఫోన్ కు ఇండియాలో ఓ రేంజ్ డిమాండ్..!
అల్పాహారం మాత్రమే కాదు, మధ్యాహ్నం, రాత్రి భోజనాన్ని కూడా ఒక నిర్దిష్ట సమయానికి చేయడం అవసరం. లేనిపక్షంలో శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, పోషకాలు సరిగా శరీరానికి అందవు. ఫలితంగా రోగ నిరోధక శక్తి బలహీనమవుతుంది.
వైద్య నిపుణుల ప్రకారం, చాలామంది ఉదయం కేవలం టీతోనే రోజును ప్రారంభించి బ్రేక్ ఫాస్ట్‌ను వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. ఆ తర్వాత తీసుకునే ఆహారం కూడా సరిగా జీర్ణం కాని పరిస్థితి వస్తుంది.
Also Read : కేరళలో మరో వైరస్ అలజడి.. లక్షణాలు ఇవే
అదేవిధంగా, బ్రేక్ ఫాస్ట్ సమయానికి చేసినా తేలికపాటి ఆహారమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం ఎక్కువగా ఆయిల్ ఉన్న పదార్థాలు లేదా ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. దీని ప్రభావం మధ్యాహ్న భోజనంపైన కూడా పడుతుంది. ఉదయం బరువైన ఆహారం తీసుకుంటే ఆకలి తగ్గిపోవడం వల్ల సమయానికి భోజనం చేయకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
కాబట్టి ఉదయాన్నే తేలికగా జీర్ణమయ్యే ఆహారం, ముఖ్యంగా ప్రోటీన్లు కలిగిన పదార్థాలను అల్పాహారంలో తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇవి శరీరానికి శక్తిని అందించడమే కాకుండా రోజంతా యాక్టివ్‌గా ఉంచుతాయని చెబుతున్నారు.