ఐఏఎస్‍ల బదిలీలో అందరి దృష్టి ఆకర్షించిన అధికారి మాత్రం ఒకరే. ఆయనే అనిల్ కుమార్ సింఘాల్. చిన్న వయసులోనే సింఘాల్ ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆయనపై ఇప్పటి వరకు ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. ఏపీలో సీనియర్ ఐఏఎస్ అధికారి సింఘాల్ ఎవరితో కూడా దురుసుగా ప్రవర్తించినట్లు గానీ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు గాని ఇప్పటి వరకు ఎక్కడా చెడ్డ పేరు లేదు. ప్రభుత్వ అధినేతలతో సింఘాల్‌కు మంచి సంబంధాలున్నాయి. అందుకే 2018లోనే తొలిసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు చేపట్టిన సింఘాల్.. ఆ తర్వాత జగన్ హయాంలో రెండేళ్ల పాటు ఈవోగా కొనసాగారంటే.. ఆయన ఎలాంటి వారో అర్థం చేసుకోవచ్చు.
Also Read : జగన్‌కు షాక్.. వైసీపీలో తిరుగుబాటు..!
టీటీడీ పరిపాలనపై అనిల్ కుమార్ సింఘాల్‌కు మంచి పట్టున్న మాట వాస్తవం. గతంలో ఈవోగా పని చేసిన సమయంలో కూడా ఉద్యోగుల దగ్గర ఎలాంటి రిమార్క్ లేకుండా చూసుకున్నారు. స్వామి భక్తుడు అయిన సింఘాల్‌కు.. టీటీడీ చేయాల్సిన పనులేంటి.. చేయకూడని పనులేంటో అనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉంది. సంస్థలో మంచి పేరున్న సింఘాల్‌కు.. ఎవరితో ఎలా ఉండాలో బాగా తెలుసు. ధర్మారెడ్డితో మంచి సమన్వయం నడుచుకున్న సింఘాల్.. ఎలాంటి వివాదాలకు తావివ్వలేదు. అయితే అతని హాయంలోనే పింక్ డైమండ్ అంటూ విజయసాయి ఆరోపణలు చేసినా.. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పై అప్పటి ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఇష్టానుసారం విమర్శలు చేసినా ఈవో నుంచి ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న విమర్శలు మాత్రం అనీల్ సింఘాల్ పై ఉన్నాయి.
ప్రస్తుతం టీటీడీపై చాలా ఆరోపణలు వస్తున్న మాట వాస్తవం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల విషయంలో ఏ చిన్న విషయం అయినా సరే.. ప్రత్యర్థులు దానిని భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడుకు పాలకవర్గం నుంచి మద్దతు లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి సమయంలో తొక్కిసలాట జరిగినప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : హడావుడిగా సచివాలయానికి లోకేష్.. కారణం ఇదే
ఇలాంటి సమయంలో అనిల్ సింఘాల్‌ను టీటీడీ ఈవోగా నియమించారు చంద్రబాబు. వాస్తవానికి టీటీడీలో ఈవోకు సర్వాధికారాలుంటాయి. టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలను అడ్డుకునే అధికారం కూడా ఈవోకు ఉంటుంది. అందుకే ప్రతి సమావేశానికి ఈవో తప్పని సరిగా హాజరవుతారు. ఆయన సమక్షంలోనే తీర్మానాలు చేస్తారు కూడా. టీటీడీపై పూర్తిస్థాయి అవగాహన ఉన్న సింఘాల్.. ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ ధార్మిక క్షేత్రంలో పరిస్థితులను గాడిలో పెడతారనేది ప్రస్తుతం ఉద్యోగుల మాట.