రాష్ట్రంలో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో విచ్చలవిడిగా సాగుతున్న బెట్టింగ్ నెట్వర్క్ లను తుదముట్టించేందుకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ విషయాల్లో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్స్ ను పోలీసులు ప్రారంభించారు.
Also Read : ఆర్టీసీ ఉద్యోగుల కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
బుకీలు, ఏజెంట్ల కార్యకలాపాలపై నిఘా ఉంచడమే కాకుండా, అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని క్షేత్రస్థాయి అధికారులను డీజీపీ ఆదేశించారు. క్లబ్ లు లేదా ఇతర రహస్య స్థావరాల్లో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే వాటిని మూసివేయాలని కఠిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్వహిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్, వెబ్సైట్లను ట్రాక్ చేసే ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు. ఈ అక్రమ కార్యకలాపాలకు పాల్పడే బుకీలు, ఏజెంట్లపై కేవలం సాధారణ కేసులు కాకుండా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేయాలని నిర్ణయించారు.
Also Read : అమరావతి వేదికగా సాకారమవుతున్న భారత క్వాంటం విప్లవం
అంతేకాకుండా, బెట్టింగ్ లావాదేవీలకు ఉపయోగిస్తున్న బ్యాంక్ ఖాతాలను తక్షణమే ఫ్రీజ్ చేసే చర్యలు కూడా ప్రారంభమయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో యువత ఈ బెట్టింగ్ ఊబిలో చిక్కుకుని తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో, యువతలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బెట్టింగ్ అనేది నేరమని, దీనివల్ల ఆర్థిక ఇబ్బందులతో పాటు చట్టపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

