కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన దివ్యక్షేత్రం తిరుమల. స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మలయప్ప స్వామి ప్రతి రోజు రెండు సార్లు వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతోంది. ఇక గరుడ సేవ సందర్భంగా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. స్వామి వారి గరుడోత్సవం కన్నుల పండువగా సాగింది. భక్తులకు ఏ విధమైన ఇబ్బంది తలెత్తకుండా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Also Read : మీరేం ప్రజా ప్రతినిధులు సార్..?
ఏడుకొండల వాడి బ్రహ్మోత్సవాలు న భూతో న భవిష్యత్ అన్నట్లుగా సాగుతున్నాయి. వాహన సేవల్లో ఏ ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయి. స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తొలిసారిగా ఏ.ఐ. టెక్నాలజీ ద్వారా భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీని వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో క్యూ లైన్‌లో వేచి ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. ఈ విధానం వల్ల భక్తులు త్వరితగతిన స్వామి వారిని దర్శించుకుంటున్నారు.
ఇక స్వామి వారి వాహన సేవల్లో ప్రతి ఏటా మాదిరిగానే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. కూచిపూడి, కోలాటం, భరతనాట్యం, సన్నాయి వాయిద్యం స్వామి వారి వాహనం ఎదురుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో పూణెకు చెందిన కళాకారులు కూడా వాహన సేవలో తమ బ్యాండ్‌తో ఆకట్టుకుంటున్నారు. మహిళలు, యువతులతో కొనసాగుతున్నసాగ బ్యాండ్ ప్రదర్శన వాహన సేవల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అయితే ఈ బ్యాండ్ ఏర్పాటు చేయడాన్ని ఇప్పుడు కొందరు తప్పుబడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. పని కట్టుకుని మరీ విమర్శలు చేస్తున్నారు. తిరుమలను పూణె చేశారు కదా అంటున్నారు. ఉత్తర భారతానికి చెందిన ఈవో వచ్చిన తర్వాత శ్రీవారి కొండపై బ్యాండ్‌కు అవకాశం కల్పించారని ఆరోపిస్తున్నారు. తిరుమల కొండను అపవిత్రం చేస్తున్నారంటున్నారు. మరి కొందరైతే డీజే పెట్టిస్తాం.. పర్వాలేదా అని వింత వాదన చేస్తున్నారు.
Also Read : మిడిల్ ఆర్డర్ లో తెలుగు ఛాంపియన్.. తిలక్ సూపర్ హిట్
అయితే భారతీయతను, మన సంస్కృతిని ప్రతిబింబించే ఏ కళా రూపాన్నైనా తిరుమల వీధులలో ప్రదర్శించడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరమూ లేదంటున్నారు కొందరు. డీజే వల్ల చెవులు చిల్లులు పడతాయే కానీ భక్తి భావన రాదు. ప్రస్తుతం వినాయక మండపాలకు కూడా అదే మాట వర్తిస్తుంది. మద్దెల, డోలు వీటిలో ఉండే ధ్వని సంగీతం వేరు, డీజే వల్ల వచ్చే శబ్ద కాలుష్యం వేరు. ప్రార్థనా భావాన్ని, దైవత్వంలో ఉండే సున్నితత్వాన్ని పెంపొందింపజేసేలా ఉండే వాద్య, నాట్య, సంగీతం అనేది అక్కడ ముఖ్యమైన విషయం అని గ్రహించలేని అజ్ఞానానికి సానుభూతి ప్రకటించడం తప్ప మరేమీ చేయలేమంటున్నారు. పూణె బ్యాండ్ వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేదంటున్నారు.