భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపధ్యంలో ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తిని రేపుతున్నాయి. పాకిస్తాన్ విషయంలో భారత ఆర్మీ దూకుడుగా వెళ్తున్న సమయంలో.. అమెరికా కళ్ళెం వేయడంతో అందరూ షాక్ అయ్యారు. భారత ప్రధాని ప్రకటించాల్సిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని.. అమెరికా అధ్యక్షుడు సోషల్ మీడియాలో ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ చేసిన ప్రకటన మరింత ఆశ్చర్యపరిచింది.
Also Read : కాల్పుల విరమణ పై దేశ ప్రజల ప్రశ్నలకి సమాధానం చెప్పేదెవరు?
దీనిపై కాంగ్రెస్ దూకుడు పెంచింది. ప్రధాని మోడీని కార్నర్ చేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భారతదేశం, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు అవకాశం ఇవ్వడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ దీనిపై పోరుకు సిద్దమవుతోంది. ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాను అని చెప్పిన తర్వాత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి కాల్పుల విరమణను ప్రకటించడం దీనిని వ్యూహాత్మక తప్పిదంగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read : వంశీ చార్జ్ షీట్ లో సంచలన విషయాలు
భారత్ – పాకిస్తాన్ వ్యవహారాల్లో మూడవ దేశం జోక్యాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. పాకిస్తాన్ తో యుద్ధం అనంతరం 1972 సిమ్లా ఒప్పందం ప్రకారం..అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ రెండు దేశాల వ్యవహారాల్లో ఏ దేశం జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేసారు. వాణిజ్య పరంగా అమెరికా బెదిరించడంతోనే భారత్ వెనక్కు తగ్గిందనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినట్టు..ట్రంప్ ప్రకటించడంపై ప్రశ్నిస్తున్న కాంగ్రెస్, భారత్-పాక్ యుద్ధం నిలిపివేతకు.. భారత్-అమెరికా వాణిజ్యానికి సంబంధమేంటని నిలదీస్తోంది. చాలా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది. వెంటనే ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది.




