ఆంధ్రప్రదేశ్ శాసన సభా సమావేశాల్లో ఏపీ ప్రభుత్వం గత ప్రభుత్వ అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెడుతోంది. తాజాగా సిఎం చంద్రబాబు చివరి రోజు తన ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీ అప్పుల వివరాలను అసెంబ్లీలో తెలిపిన సీఎం చంద్రబాబు… తాను చెప్పిన లెక్కలపై అనుమానం ఉన్నా, కాదని ఎవరైనా అన్నా సరే అసెంబ్లీకి రావాలని సవాల్ చేసారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు : రూ.9,74,556 కోట్లుగా సిఎం లెక్కలు బయటపెట్టారు. గవర్నమెంట్ డెబిట్ – రూ.4,38,278 కోట్లని తెలిపిన ఆయన… పబ్లిక్ అకౌంట్ లయబిలిటీస్ – రూ.80,914 కోట్లని తెలిపారు.
Also Read : మండలిలో వైసీపీ నేతలపై నారా లోకేష్ ఆగ్రహం
కార్పొరేషన్ డెబిట్ – రూ.2,48,677 కోట్లు అని సిఎం బయటపెట్టారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి రూ.36,000 కోట్లు అప్పు తీసుకున్నట్టు తెలిపారు. పవర్ సెక్టార్ లో రూ.34,267 కోట్లు అప్పులు ఉన్నాయన్న ఆయన అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు వెండార్స్ అన్ని స్కీమ్స్ కలిపి రూ.1,13,244 కోట్లుగా లెక్కలు చదివి వినిపించారు. అవుట్ స్టాండింగ్ డ్యూస్ టు ఎంప్లాయీస్ – రూ. 21,980 కోట్లు కాగా, నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ – రూ.1,196 కోట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. కన్నతల్లి శీలాన్ని శంకించేలా పోస్టులు పెట్టించారని మండిపడ్డారు. ఆడబిడ్డలను కించపరిచేలా పోస్టులు పెడితే ఉపేక్షించమని స్పష్టం చేసారు. అవినీతి, అక్రమాలు చేసేందుకు కొందరు రాజకీయాల్లోకి వచ్చారన్న ఆయన… మహిళలను కించపరిచేలా కూటమి నేతలెవరూ పోస్టులు పెట్టరని పెట్టించబోరు స్పష్టం చేసారు. ఒక వేళ అదే జరిగితే సొంతవాళ్లని కూడా చూడకుండా కఠినంగా వ్యవహరిస్తామన్నారు చంద్రబాబు.
Also Read : మదనపల్లి ఫైల్స్ ఘటనలో పెద్దిరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..!
జగన్ ఒక్క ఛాన్స్ అని వచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని, మేం ఊహించిన దానికంటే ఎక్కువ విధ్వంసం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం జీవోలు కూడా ఆన్‌లైన్‌లో ఉంచలేదని గుర్తు చేస్తూ.. గత ప్రభుత్వం కాగ్ కు కూడా నివేదికలు ఇవ్వలేదని, విభజన నష్టం కంటే గత ఐదేళ్లలోనే ఎక్కువ నష్టం జరిగిందని తేల్చి చెప్పారు. గత ఐదేళ్లలో వినూత్నమైన రీతిలో జగన్ బృందం దోపిడీ చేసారని, వాళ్ల దోపిడీ కొనసాగించేందుకు వ్యవస్థలను కూడా నాశనం చేసారని, వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు, అప్పులు రాష్ట్రానికి శాపంగా మారాయని, స్కాముల కోసమే స్కీములు అమలు చేసారని సంచలన వ్యాఖ్యలు చేశారు.