ఏపీలో లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. మద్యం కుంభకోణంలో వేల కోట్ల దోపిడి జరిగిందని తొలి నుంచి టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ స్కామ్‌పై స్పెషల్ ఇన్‌వెస్ట్‌గేషన్ టీమ్.. సిట్ ఏర్పాటు చేసింది. ఈ సిట్ బృందం ఇప్పటికే సుమారు 200 మందిని విచారించింది. ఈ కేసులో రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిలను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో త్వరలోనే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అరెస్టు ఖాయమనే మాట బలంగా వినిపిస్తోంది. ఆ తర్వాత కీలక వ్యక్తుల అరెస్టు అని అంతా భావిస్తున్నారు.
Also Read : మహిళపై దాడి.. డైరెక్ట్ గా ఎస్పీకి చంద్రబాబు ఫోన్
చెవిరెడ్డి చుట్టూ ఇప్పటికే ఉచ్చు బిగించారు అధికారులు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. దీంతో బెంగళూరు నుంచి కొలంబో వెళ్తున్న చెవిరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో చెవిరెడ్డి దగ్గర పని చేస్తున్న సిబ్బందిని కూడా విచారిస్తున్నారు. ఇక్కడే చెవిరెడ్డి తనలోని లాయర్‌ను బయటకు తీశారు. తిరుపతి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి పదేళ్లుగా చెవిరెడ్డి దగ్గర గన్‌మెన్‌గా పని చేస్తున్నారు. దీంతో మదన్ రెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. సిట్ విచారణ తర్వాత మదన్ రెడ్డి ఏపీ డీజీపీకి రాసిన లేఖ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. సిట్ అధికారులు తనపై ఒత్తిడి తీసుకువచ్చారని.. చెవిరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలని.. సంతకం చేయాలని కూడా తనని చిత్రహింసలకు గురి చేసినట్లు మదన్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోసారి సిట్ విచారణకు తాను ఒక్కడినే వెళ్లేది లేదని.. ఎవరినైనా తోడుగా తీసుకెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని కూడా లేఖలో స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ లేఖతో పాటు మదన్ రెడ్డి ఆసుపత్రిలో చేరిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Also Read : మెగా ఫ్యాన్స్‌కు తప్పని నిరాశ.. ఆ సినిమా సంగతేంటి..?
ఈ వ్యవహారం సిట్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ ఘటనపై సిట్ అధికారులు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. మదన్ రెడ్డిని సిట్ అధికారులు ఎవరూ ఒత్తిడి చేయలేదని.. బలవంతం చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని లేఖ విడుదల చేశారు. తనను ప్రశ్నిస్తే అధికారుల పేర్లు రాశి ఆత్మహత్య చేసుకుంటానని అధికారులనే మదన్ రెడ్డి బెదిరించారన్నారు. ఈ కేసులో ఇప్పటికే 200 మందిని పైగా విచారించామని.. ఎక్కడా ఎలాంటి రాజకీయ ఒత్తిడికి ఆస్కారం లేదని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో కొంతమంది తప్పించుకోవడానికే ఈ తరహా తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారని సిట్ అధికారులు వెల్లడించారు.
Also Read : అవును.. వీళ్లంతా జర్నలిస్టులు..!
ఇప్పటి వరకు తమపై ఎలాంటి ఆరోపణలు రాలేదని.. అయితే మదన్ రెడ్డి ఒక కొత్త డ్రామాకు తెర తీసినట్లు సిట్ బృందం ఆరోపిస్తోంది. తప్పుడు ఆరోపణలతో డీజీపీకి ఒక లేఖ ఇచ్చారని.. దానిని కొన్ని ఛానల్స్‌లో వైరల్ చేశారని.. హైకోర్టులో కూడా పిటిషన్ వేసినట్లు వెల్లడించారు. దీని వెనుక కుట్ర కోణం ఉందని.. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో సంబంధం ఉన్న బాలాజీ కుమార్ యాదవ్ అనే వ్యక్తిని సిట్ పోలీసులు అక్రమ నిర్బంధం చేశారని హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారని.. ఇది పచ్చి అబద్ధం అని సిట్ అధికారులు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై ఒక సీనియర్ అధికారితో ఉన్నత స్థాయి విచారణ చేయించాలని డీజీపీకి లేఖ రాసినట్లు సిట్ అధికారులు తెలిపారు.
Also Read : ఫోన్ ట్యాపింగ్ లో పేలిన బాంబు.. వెయ్యి మంది ఫోన్లు..?
ఈ మొత్తం వ్యవహారంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి చెవిరెడ్డి ఏకంగా సిట్ అధికారులపైనే రివర్స్ కేసు పెట్టించినట్లు పోలీసులే చెబుతున్నారు. అదే సమయంలో లిక్కర్ స్కామ్ కేసు విచారణపై ప్రజల్లో కూడా తప్పుడు ప్రచారానికి అవకాశం వస్తుంది. అటు సిట్ బృందంపై తప్పుడు ప్రచారం కూడా జరుగుతోంది.