ప్రముఖ గాయని మంగ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు. తనను సుమారు 10 కోట్ల రూపాయల మేర మోసం చేసిందని, అంతేకాకుండా ఆమె వల్ల తనకు ప్రాణహాని ఉందంటూ ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించడం సంచలనంగా మారింది. గతంలో పలుమార్లు చిన్నపాటి వివాదాల్లో నిలిచిన మంగ్లీపై, ఈసారి ఏకంగా భారీ ఆర్థిక మోసం, బెదిరింపుల ఆరోపణలు రావడం టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బాధితుడు అందించిన వివరాల ప్రకారం.. మంగ్లీ తనను ఆర్థికంగా తీవ్రంగా నష్టపరిచిందని, సుమారు 10 కోట్ల రూపాయల లావాదేవీల్లో మోసానికి పాల్పడిందని ఆరోపించాడు.
Also Read : కేబినెట్ సమాచారం లీక్.. మంత్రులపై చంద్రబాబు డౌట్
ఈ విషయంలో ఆమెను ప్రశ్నించినందుకు తనను చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని పోలీసులకు వివరించడంతో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కేవలం మంగ్లీ మాత్రమే కాకుండా, ఆమె సోదరుడు, మరో ముగ్గురు వ్యక్తులు కలిసి తనను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ప్రాథమిక విచారణ అనంతరం కేసు నమోదు చేశారు. మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, ఇతర నిందితులపై కొత్త భారతీయ న్యాయ సంహిత ప్రకారం సెక్షన్ 351(2), 352 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Also Read : తలనొప్పిగా మారిన క్లీన్ పాలిటిక్స్ నినాదం..!
ఈ ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కేసుపై మంగ్లీ కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. వరుస పాటలతో బిజీగా ఉన్న మంగ్లీపై ఇలాంటి కేసు నమోదు కావడం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. త్వరలోనే ఈ వ్యవహారంలో మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇటీవల ఓ ఫాం హౌస్ వ్యవహారంలో కూడా మంగ్లి పేరు వినపడింది.

