2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ అధికారుల తీరు అప్పట్లో వివాదాస్పదంగా ఉండేది. వైసీపీ నేతలకు అన్ని విధాలుగా సహకరించే పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా ఇబ్బందులకు గురి చేశారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. తమకు సహకరించే పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పించడం.. తమను ఇబ్బంది పెడతారు అనుకున్న పోలీసులను విఆర్ కు పంపడం.. వారిని జీతాలు లేకుండా ఇబ్బందులకు గురి చేయడం వంటివి అప్పట్లో ఎక్కువగా జరిగేవి. దీనితో పోలీసు అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దలకు భయపడి టిడిపి నేతలను ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురిచేసిన సందర్భాలు ఉన్నాయి.
Also Read :పాజిటివ్ వైబ్రేషన్ కోసం చంద్రబాబు తపన
ప్రభుత్వం మారిన తర్వాత కూడా సదరు పోలీస్ అధికారుల తీరులో మార్పు కనపడలేదు. ఇక ఇప్పటివరకు పోలీసుల విషయంలో చూసి చూడనట్లు వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మాత్రం చర్యలకు రంగం సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత జిల్లా చిత్తూరు నుంచి పోలీస్ శాఖను ప్రక్షాళన చేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇటీవల టిడిపి కార్యకర్త రామకృష్ణ హత్య వ్యవహారం తర్వాత పోలీసు శాఖ ప్రక్షాళన వేగవంతమైంది. ఒకే రోజు 264 మంది పోలీసులను చిత్తూరు జిల్లాలో బదిలీ చేసింది పోలీస్ శాఖ. అరాచక శక్తులను అదుపు చేయడంతో పాటుగా వారికి సహకరిస్తున్న పోలీసులను బదిలీలు లేదా సస్పెన్షన్లు చేస్తోంది.
Also Read : ఐటి టవర్ శంకుస్థాపనకు బిల్ గేట్స్.. అమరావతి పనుల్లో కీలక అడుగు
అన్నమయ్య జిల్లాలో కూడా పెద్ద ఎత్తున బదిలీలు జరిగాయి. కీలక స్థానాల్లో ఉన్న 42 మంది అధికారులను ఒకేరోజు బదిలీ చేశారు. ఇప్పటికే పలువురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే మరి కొంత మందిపై వేటు వేసే అవకాశాలు సైతం కనబడుతున్నాయి. ఇక పలు జిల్లాల్లో పోలీస్ అధికారుల వ్యవహారాలపై రాష్ట్ర డీజీపీ సమాచారం సేకరిస్తున్నారు. గతంలో అక్రమాలకు పాల్పడిన పోలీసులపై అంతర్గత విచారణకు కూడా ఇప్పటికే పోలీస్ శాఖ ఆదేశించింది. ఇక ఇప్పటికీ వైసీపీ నేతలతో సావాసం చేస్తున్న పోలీస్ అధికారుల సమాచారాన్ని కూడా ప్రభుత్వ పెద్దలు సేకరించారు. త్వరలోనే కీలక అధికారులు వేటు వేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.