ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు గొప్పగా చెబుతున్నారు. అయితే ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోను అమలు చేసినప్పటికీ.. ఆయా ప్రాంతాల్లో ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటికీ కొన్ని అలాగే ఉన్నాయి. వాటి అమలు కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఎప్పుడు అమలు చేస్తారని నేరుగా చంద్రబాబునే ప్రశ్నిస్తున్నారు. వాటిల్లో ప్రధానమైనది పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి ఇచ్చిన హామీలు. ఎన్నికల సమయంలో రెండు ప్రధాన హామీలిచ్చిన చంద్రబాబు. వాటిల్లో ఒకటి వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, మరోకటి మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు. ఈ రెండు హామీలు అమలైతే పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి తిరుగు ఉండదనే మాట వినిపిస్తోంది కూడా.
Also Read : కర్నూలులో ఇండియన్ ఆర్మీ సంచలన ప్రయోగం..!
కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి మార్కాపురం, ఒంగోలు, కందుకూరు డివిజన్‌లను వేరు చేసి ప్రకాశం జిల్లా ఏర్పాటు చేశారు. ఒంగోలును జిల్లా కేంద్రం చేశారు. సముద్ర తీర ప్రాంతం కావడంతో పశ్చిమ ప్రాంతానికి ఒంగోలు దూరమైంది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే మార్కాపురం నుంచి వంద కిలోమీటర్లు, గిద్దలూరు నుంచి 120 కిలోమీటర్లు, యర్రగొండపాలెం నుంచి 140 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీంతో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో వినిపిస్తోంది. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన జగన్ ప్రభుత్వం.. పార్లమెంట్ నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. దీంతో మార్కాపురం జిల్లా ఏర్పాటు జరగలేదు. 2019 ఎన్నికల సమయంలో కూడా వైఎస్ జగన్‌తో పాటు వైసీపీ నేతలు కూడా మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ అమలు చేయలేదు.
కొత్త జిల్లాల ఏర్పాటులో పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి తీరని అన్యాయం జరిగిందని ఈ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు సుమారు 3 నెలల పాటు రిలే నిరాహార దీక్షలు కూడా చేశారు. అయినా సరే వైసీపీ ప్రభుత్వం దిగిరాలేదు. ఇదే సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే జిల్లా ఏర్పాటు చేసిన తర్వాతే ఈ ప్రాంతానికి వస్తా అన్నారు కూడా. ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాది దాటింది. తాజాగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణపై చంద్రబాబు సర్కార్ మంత్రివర్గ ఉపసంఘం నియమించింది. ఈ కమిటీ జిల్లాలు, మండలాలు, గ్రామాల సరిహద్దులపై చర్చించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. జిల్లాలో పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాను రెండు జిల్లాలుగా విభజించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చి 8వ తేదీన మార్కాపురంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో కూడా ఓ యువతి నేరుగా చంద్రబాబుని మార్కాపురం జిల్లా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. సాధ్యమైనంత త్వరలో అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Also Read : ఎప్పుడైనా మేం రెడీ.. ఆపరేషన్ సిందూర్ కంటిన్యూ.. ఆర్మీ చీఫ్ కామెంట్స్
మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, కనిగిరి నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే శ్రీశైలం, సుండిపెంట ప్రాంతాలను కూడా మార్కాపురం కేంద్రంగా ఏర్పాటయ్యే జిల్లాలో కలపాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీని వల్ల ఈ ప్రాంతానికి ఎంతో మేలు జరుగుతుందనే వాదన కూడా ఉంది. మొత్తానికి జిల్లాల పునర్ వ్యవస్థీకరణ కమిటీ సూచనల మేరకు చంద్రబాబు హామీ నెరవేరుతుందని పశ్చిమ ప్రకాశం ప్రాంత వాసులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు.