ఏపీ ముఖ్యామంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తెలంగాణా విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. పార్టీని తెలంగాణలో బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇటీవల తెలంగాణాలో పార్టీకి సంబంధించిన కమిటీలను అన్నిటిని రద్దు చేసారు. త్వరలోనే రాష్ట్ర అధ్యక్ష పదవి, అలాగే రాష్ట్ర తెలుగు యువత, తెలుగు రైతు, వర్కింగ్ ప్రెసిడెంట్ వంటి కీలక పదవులపై చంద్రబాబు దృష్టి పెడతారు అని తెలుస్తోంది. ఇక పార్టీలోకి ఎవరైనా వస్తే వారిని ఆహ్వానించే ఆలోచనలో కూడా చంద్రబాబు ఉన్నట్టుగా సమాచారం.
ఇదిలా ఉంచితే తెలంగాణాలో ఇప్పుడు చంద్రబాబు పర్యటనలు కూడా చేసేందుకు సిద్దమవుతున్నారు. రాబోయే ఆరు నెలల కాలంలో కనీసం మూడు సార్లు పర్యటించి సభలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. అలాగే రంగారెడ్డి జిల్లాలో కూడా పార్టీకి క్షేత్ర స్థాయిలో పట్టు ఉంది. అందుకనే చంద్రబాబు ఇప్పుడు జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా బీఆర్ఎస్ కు చెందిన నేతలను పార్టీలోకి తీసుకోవాలని ప్లాన్ సిద్దం చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కూకటపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు పార్టీ మారే ఆలోచనలో ఉన్నారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన అల్లుడు కూడా టీడీపీ తీర్ధం పుచ్చుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అలాగే నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సంద్రా వెంకట వీరయ్య సహా పలువురు కీలక నేతలు పార్టీ మారాలని భావిస్తున్నారు. అందుకనే చంద్రబాబు ఇప్పుడు జిల్లాల పర్యటనలు చేసి కార్యకర్తలకు ధైర్యం నింపాలని భావిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తరుచుగా ట్రస్ట్ భవన్ కు వెళ్తున్న చంద్రబాబు… పార్టీ నేతలకు ఇదే విషయం చెప్పినట్టు సమాచారం.