పదే పదే విమర్శలు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు.. నాకు అన్యాయం జరిగిందని ఒకరు.. అది తప్పుడు ఆరోపణ అని మరొకరు, కృష్ణా జిల్లా టీడీపీలో గత కొన్నాళ్ళుగా కనపడుతున్న సీన్ ఇది. గతంలో దేవినేని ఉమా కారణంగా పార్టీలో విభేదాలు అనే వార్తలు రాగా.. ఇప్పుడు ఏకంగా పదవుల్లో ఉన్న వారే.. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకునే పరిస్థితి. అంతర్గత సమస్యలు ఉన్నప్పటికీ సద్దుమణిగినా, ఇప్పుడు మాత్రం బహిరంగం అవుతున్నాయి. నాయకులు గాడి తప్పుతూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
Also Read : టీడీపీలో వారికి గ్యారంటీ లేదా..?
ఎమ్మెల్యే కొలికపూడి, ఎంపీ కేసినేని మధ్య విభేదాలు రోజు రోజుకి తీవ్రమవుతున్నాయి. ఇక తాజా వ్యవహారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంపై సిఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇన్నాళ్ళు ఈ వ్యవహారాలను చూసి చూడనట్టు వదిలేసిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఉక్కుపాదం మోపేందుకు సిద్దమయ్యారు. కొందరు పార్టీ నేతలు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం.. వివాదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేసుకోవడంపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసారు.
కొలికపూడి వర్సెస్ కేసినేని వ్యవహారంలో.. పల్లా శ్రీనివాసరావు, వారిని పార్టీ కేంద్ర కార్యాలయానికి పిలవగా.. చంద్రబాబు వెంటనే, పల్లా శ్రీనివాస్ తో దుబాయ్ నుంచి ఫోన్ లో మాట్లాడారు. వివాదానికి కారణమైన ఇద్దరు నేతలను పిలిచి మాట్లాడతానని సీఎం చంద్రబాబుకు పల్లా తెలుపగా.. వాళ్ళతో ఏం మాట్లాడతారని, మాట్లాడవద్దని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై తానే దృష్టి పెడతానని, తాను రాష్ట్రం కోసం విదేశాల్లో ఉంటే, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని సిఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Also Read : కొలికపూడి వర్సెస్ కేసినేని.. అధిష్టానం సీరియస్.. మంగళగిరిలోనే పంచాయితీ..!
పార్టీలో అయినా, ప్రభుత్వంలోనైనా పాజిటివ్‌నెస్ దెబ్బతీసేలా క్రమశిక్షణ ఉల్లంఘించేలా వ్యవహరించేవారిని ఇక ఉపేక్షించేది లేదని స్పష్టం చేసారట సిఎం. బహిరంగ విమర్శలు చేయడం క్రమశిక్షణను ఉల్లంఘించడమేనని, బాధ్యతారాహిత్య వ్యాఖ్యలతో అనవసర చర్చకు తావిచ్చేలా నేతలు వ్యవహరించడం సమంజసం కాదని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఇక కఠినంగా డీల్ చేయాల్సిన అవసరం వచ్చిందని సిఎం తెలిపారట. దీనితో ఇద్దరు నేతలతో భేటీని పల్లా రద్దు చేసినట్టు సమాచారం.




