ఏపీలో వరద సహాయ కార్యక్రమాలు ఒక కొలిక్కి వస్తుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు పరిపాలన పై దూకుడు పెంచుతున్నారు. వరదల కారణంగా ప్రభుత్వం, పార్టీ వ్యవహారాల్లో కాస్త గ్యాప్ రావడంతో ఆయన తిరిగి ఫోకస్ పెడుతున్నారు. గాంధీ నగర్ వెళ్ళిన చంద్రబాబు… తిరిగి వచ్చిన తర్వాత పార్టీ ఎమ్మెల్యేల పని తీరు మీద ఫోకస్ పెడతారని తెలుస్తోంది. ఎమ్మెల్యేల పని తీరు మీద రేటింగ్ రెడీగా ఉందని, ఇప్పటికే చంద్రబాబు టేబుల్ మీద నివేదికలు కూడా ఉన్నాయని సమాచారం. రేపు లేదా ఎల్లుండి టీడీపీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అవుతారు.

ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరో నాలుగు రోజుల్లో వంద రోజులు పూర్తి కావడంతో చంద్రబాబు ప్రభుత్వం పాలన నుంచి ఎమ్మెల్యేల పని తీరు గురించి రివ్యూలు తీసుకుంటారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకుంటారు. ఇక కొందరు ఎమ్మెల్యేల పని తీరు మీద చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎమ్మెల్యేలు కొందరు కావాలనే కొన్ని వ్యవహారాల్లో తలదూర్చి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నారనే సమాచారం చంద్రబాబు వద్దకు చేరింది. ఒక మహిళా ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే చాలా ఫిర్యాదులు ఆమె భర్త గురించి వచ్చాయి. పార్టీ కార్యకర్తలను పట్టించుకోకుండా వైసిపి నాయకులను కార్యకర్తలు వెంటపెట్టుకొని, తిరగడం పై చంద్రబాబు సీరియస్ గా ఉన్నారు.

ఇక నామినేటెడ్ పదవుల మీద కూడా చంద్రబాబు కసరత్తు పూర్తి చేసారు. రేపు లేదా ఎల్లుండి నామినేటెడ్ పదవులు భర్తీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల ప్రక్రియ పూర్తి అయింది. మొదటగా 18 కార్పొరేషన్ చైర్మన్లు విడుదల చేసే అవకాశం ఉంది. మిగిలిన నామినేటెడ్ పదవులు అన్ని దసరా లోపు పూర్తి చేస్తారు. ముగ్గురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. వీరి వ్యవహారం మరీ శృతిమించుతోంది నిఘా వర్గాల సమాచారంతో ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం మిగతా ఎమ్మెల్యేలను దారిలో పెడుతుందని పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి ఏమి జరగబోతుందో చూడాలి.