ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు భూ అక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే అవకాశం కనపడుతోంది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేని విధంగా భూ అక్రమాలకూ గత ప్రభుత్వంలో వైసీపీ నేతలు పాల్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ అక్రమాలను బయటకు రానీయకుండా ఏకంగా ఆర్డీవో ఆఫీసులకు కూడా నిప్పు పెట్టిన పరిస్థితి ఉంది. ఇక పలు చోట్ల పత్రాలను కూడా దొంగ చాటుగా తరలిస్తున్నారు. నిన్న శ్రీకాకుళం జిల్లాలో కూడా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాదాపుగా ప్రభుత్వ భూములను చాలా వరకు వైసీపీ నేతలు కబ్జా చేసినట్టుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో ఇప్పుడు ఒక కఠిన చట్టాన్ని తీసుకు రావాలని సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ భూములను సర్వే చేసి, వాటిని ఎవరైనా కబ్జా చేస్తే తిరిగి స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇక దీనిపై కఠిన చట్టాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీలో ప్రభుత్వ భూములను ఎవరైనా కబ్జా చేస్తే జైలు శిక్షతో పాటుగా భారీ జరిమానా విధించే దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఇక కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయనున్నారు. ఇక ఎర్ర చందనం విషయంలో కూడా ఇలాగే కఠిన చట్టం తీసుకురానున్నారు. ఇప్పటికే ఉన్న చట్టాలను పకడ్బందీగా అమలుచేయడానికి అధికారులకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది.
అలాగే అక్రమ మైనింగ్ విషయంలో కూడా ప్రభుత్వం ఇలాగే కఠినంగా వ్యవహరించే దిశగా అడుగులు వేస్తోంది. భూ రికార్డులకు సంబంధించి ఇప్పుడు ఆన్లైన్ ప్రక్రియ చేపట్టాలని, అన్ని భూముల వివరాలను ఒక వెబ్ సైట్ తెచ్చి అందులో చేర్చాలని భావిస్తోంది. ఇక రిజిస్ట్రేషన్ పత్రాలకు సంబంధించి కూడా ఆన్లైన్ ప్రక్రియను చేపట్టే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కబ్జాలు జరిగిన భూములను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకుని, వాటిని యజమానులకు అప్పగించే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తూ, భూ దోపిడీకి పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరించే దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది.




