2024 లో టిడిపి అధికారంలోకి రావడానికి సూపర్ సిక్స్ పథకాలు కీలకమయ్యాయి. వీటిపై ఇచ్చిన హామీలకు ప్రజల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. దీనితో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారాన్ని జనసేన, బిజేపితో కలిసి కైవసం చేసుకుంది. ఇక ఎన్నికల ప్రచారంలో దీనిపై అప్పట్లో చేసిన వ్యాఖ్యలను వైరల్ చేస్తూ.. వైసిపి పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ పథకాలను చేయడం లేదని ఆరోపించింది. ముఖ్యంగా ఈ కార్యక్రమాల్లో తల్లికి వందనం పథకం అత్యంత కీలకంగా మారింది. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఇస్తామని అప్పట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారం చేశారు.
Also Read : కారు స్టీరింగ్ పట్టుకునేది ఎవరు..?
అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పథకాన్ని అమలు చేయకపోవడంతో ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత పెరుగుతోంది. నియోజకవర్గాల్లో దీనిపై కార్యకర్తల్లో కూడా కాస్త అసహనం కనపడుతుంది. కేవలం పెన్షన్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తోందనే ఆరోపణ వినపడుతోంది. తాజాగా దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక ప్రకటన చేశారు. తల్లికి వందనం కార్యక్రమాన్ని మే నెల నుంచి అమలు చేస్తామని, అలాగే రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తామంటూ ప్రకటించారు.
Also Read : కూటమిలో ఎమ్మెల్సీ ఎన్నికల భయం..!
అయితే దీనిపై ప్రచారం చేసుకునే విషయంలో మాత్రం టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులు విఫలమవుతున్నారు. సోషల్ మీడియాలో కూడా దీనిపై పెద్దగా హడావుడి కనపడటం లేదు. పథకం అమలు కావడం లేదని వైసీపీ చేసిన నెగిటివ్ ప్రచారం జనాల్లోకి బాగా వెళితే.. చంద్రబాబు నాయుడు స్వయంగా చేసిన ప్రకటనలు మాత్రం ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో టిడిపి సోషల్ మీడియా ఫెయిల్ అయింది. దీనికి సంబంధించిన వీడియోలు గానీ వార్తలు గానీ పెద్దగా సోషల్ మీడియాలో కనపడకపోవడం గమనార్హం. ఇతర విషయాలపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్న టిడిపి సోషల్ మీడియా దీనిని పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది.
అటు కూటమిలో ఉన్న జనసేన బిజెపి కూడా దీనిపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దీనిపై పెద్దగా స్పందించడం లేదు. కనీసం మీడియా సమావేశాలు కూడా టిడిపి నేతల నుంచి రాకపోవడం ఆశ్చర్యం కలిగించే అంశం. గతంలో జగన్ ఏదైనా పథకం ప్రకటించినా.. దాన్ని అమలు చేసిన సరే మీడియాలో వైసీపీ పెద్ద ఎత్తున హడావిడి చేసేది. కానీ ఇప్పుడు మాత్రం దీనిపై టిడిపి నేతలు మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించకపోవడం గమనార్హం.




