తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసి, పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఏలిన భారత రాష్ట్ర సమితికి ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ కోలుకుంటుందని ఆశించిన శ్రేణులకు.. తాజా రాజకీయ పరిణామాలు మింగుడుపడటం లేదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు వెళ్తున్న ఎమ్మెల్యేల దెబ్బ ఒకటి అయితే.. తాజాగా స్పీకర్ ఇచ్చిన తీర్పుతో మరికొందరు పార్టీ మారే అవకాశం ఉందనే కథనాలు కంగారు పెడుతున్నాయి. ఇప్పటి వరకు దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి సీనియర్ నాయకులు సహా పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Also Read : ఇండియన్స్ కు యూఏఈ గుడ్ న్యూస్
తాజాగా స్పీకర్ వీరి అనర్హత పిటిషన్లను కొట్టివేయడంతో బీఆర్ఎస్ నైతికంగా మరింత దెబ్బతిన్నట్లు కనిపిస్తోంది. పార్టీ మారాలి అనుకునే వాళ్లకు ఇది మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పునాదులను కదిలించాయి. ఒకప్పుడు పట్టణ ప్రాంతాల్లో బలంగా ఉన్న పార్టీ, ఇప్పుడు కాంగ్రెస్ దెబ్బకు నామమాత్రపు స్థానాలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ చెల్లాచెదురవుతోందనే విమర్శలకు ఈ ఫలితాలే నిదర్శనం అనే మాట వినపడుతోంది.
Also Read : కొరివితో తలగోక్కున్న కావ్య మారన్..!
తెలంగాణ సెంటిమెంట్‌ను పక్కనపెట్టి జాతీయ పార్టీగా మారడం పార్టీ కొంపముంచిందనే చర్చ పార్టీలోనే నడుస్తోంది. అటు జాతీయ స్థాయిలో ప్రభావం చూపలేక, ఇటు రాష్ట్రంలో సెంటిమెంట్‌ను పట్టుకోలేక పార్టీ సందిగ్ధంలో పడిందనే ఆవేదన పార్టీలో వినపడుతోంది. వరుస ఎన్నికల ఓటములు, నాయకుల ఫిరాయింపులు, న్యాయపరమైన చిక్కులతో బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్టీని మళ్లీ గాడిలో పెట్టాలంటే కేవలం విమర్శలు చేయడం కాకుండా, ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేలా పార్టీ అధినాయకత్వం కొత్త వ్యూహాలతో రావాల్సి ఉంది. ఇప్పటికే కీలక ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్ళారు అనే విమర్శలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి.

