ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో టిడిపి నుంచి వచ్చిన నాయకులు తిరిగి టిడిపి గూటికే చేరేందుకు ప్రయత్నాలు చేస్తుండగా, వైసీపీ కీలక నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా వైసీపీ నుంచి బయటకు రానున్నారా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. గత కొన్నాళ్ళుగా ఆయన పార్టీ అధిష్టానంపై తీవ్ర అసహనంతో ఉన్నారు. పార్టీ అధిష్టానం తన మాట కనీసం పట్టించుకోవడం లేదనే ఆవేదన ఆయనలో స్పష్టంగా కనపడుతోంది. కీలక సమయంలో తనకు అండగా నిలవాల్సిన పార్టీ ఇప్పుడు సైలెంట్ గా ఉండటం బాలినేనికి అసలు నచ్చడం లేదు.
పార్టీ బలోపేతం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన బాలినేనికి వైసీపీలో అనుకున్న విధంగా గుర్తింపు దక్కలేదనే ఆవేదన ఉంది. గతంలో కూడా మంత్రి పదవి విషయంలో కూడా ఆయన తీవ్ర అసంతృప్తి గానే ఉన్నారు. ఇక జిల్లాలో కొందరు తనపై పెత్తనం చెలాయించడం బాలినేనికి ఏ మాత్రం నచ్చలేదు. తర్వాత వచ్చిన వాళ్ళు తనను ఇబ్బంది పెడుతున్నారని బాలినేని చెప్పినా సరే జగన్ పెద్దగా పట్టించుకోలేదని బాలినేని తన అనుచరుల వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
Read Also : అతి చేయొద్దు.. అధికారుల పై బాబు ఆగ్రహం
అలాగే పార్టీ పదవుల విషయంలో బాలినేని మాటకు అసలు విలువ ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసారు. ఇక ఇటీవల ఈవీఎం ల విషయంలో బాలినేని పోరాటం చేస్తున్నా పార్టీ నుంచి మాత్రం ఊహించిన స్పందన రాలేదు. తాను ఒక్కడే పోరాటం చేస్తున్నట్టుగా అర్ధమైంది. దీనిపై కూడా బాలినేని బహిరంగంగానే అసహనం వ్యక్తం చేసారు. అందుకే త్వరలో పార్టీ మారాలని భావిస్తున్నారు. జనసేనలో చేరేందుకు సిద్దమవుతున్నారు. ఇప్పటికే జనసేన కీలక నాయకులతో భేటీ పూర్తి చేసినట్లు తెలుస్తుంది.
టీడీపీలో అవకాశం లేకపోవడంతో బాలినేని జనసేన లోకి వెళ్లేందుకు సిద్దమవుతున్నారు అని అంతర్గత సమాచారం. మోపిదేవి వెంకట రమణ తో కలిసి టిడిపిలోకి వచ్చే ప్రయత్నం చేసినా అది సాధ్యం అయ్యేలా కనపడటం లేదు. అందుకే ఇప్పుడు జనసేనలోకి వెళ్లేందుకు బాలినేని సిద్దమవుతున్నారు. త్వరలోనే రాజీనామా నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే తన అనుచరులతో తన నిర్ణయాన్ని తెలియచేసి, మద్దతు తెలపాలని కోరారు అని తెలుస్తుంది.