నందమూరి బాలకృష్ణ అలియాస్ NBK.. ఈ మూడు అక్షరాలు చాలు.. బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి తారక రామారావు నటన వారసుడిగా వెండితెరపై మెరిసిన బాలయ్య.. ఆ తర్వాత తన నటనతో ప్రేక్షకులను అలరించారు. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. సినిమా లైబ్రరీలో తనకంటూ ఓ ప్రత్యేక పుస్తకాన్నే ఏర్పాటు చేశారు. ఇంకా చెప్పాలంటే.. తెలుగు సినీ చరిత్రలో 50 ఏళ్ల పాటు నటించిన నటుల్లో బాలకృష్ణ మూడో వ్యక్తి మాత్రమే. అక్కినేని 70 ఏళ్ల పాటు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ సరిగ్గా 50 ఏళ్ల పాటు వెండితెరపై నటించారు. ఆ తర్వాత నందమూరి నటసింహం బాలయ్య మాత్రమే 50 ఏళ్ల పాటు సిల్వర్ స్క్రీన్‌పైన కనిపిస్తున్నారు.
Also Read : భారీ బడ్జెట్ కో దండం.. హీరోల పరువు పోతుందా..?
అటు వెండితెరపైన, ఇటు రాజకీయాల్లో కూడా రాణించిన ఏకైక స్టార్ నందమూరి బాలకృష్ణ. హిందూపురం నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా వరుసగా గెలిచిన సినీ నటులు ఇద్దరే. ఒకరు తండ్రి నందమూరి తారక రామారావు.. మరొకరు కుమారుడు నందమూరి బాలకృష్ణ. ఈ ఇద్దరు మాత్రమే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన సినీ హీరోలు. మరెవ్వరు ఈ రికార్డు సాధించలేదు. 1960లో జన్మించిన బాలకృష్ణ.. 1974లో తాతమ్మ కల సినిమాతో వెండితెర ఆరంగేట్రం చేశారు. నాటి నుంచి నేటి వరకు బాలయ్య చేయని జోనర్ లేదు. సాంఘిక, పౌరాణిక, జానపద, సోషియో ఫాంటసీ, ఆధ్యాత్మిక, కామెడి.. ఇలా ఎన్నో బాలయ్య చేసినవే. ఇప్పటికీ బాలయ్య సినిమా రిలీజ్ అంటే.. తెలుగుదనం ఉట్టిపడే గెటప్‌లో థియేటర్‌కు వచ్చే వాళ్లు ఎంతో మంది. చిన్నా పెద్దా అనే తేడా బాలయ్య అభిమానుల్లో లేదు. ఆరేళ్ల పిల్లల నుంచి.. 60 ఏళ్లు దాటిన వారు కూడా బాలయ్య ఫ్యాన్స్.
50 ఏళ్ల సినీ ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. లండన్‌కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో బాలయ్య పేరు చేరింది. ఈ గౌరవం దక్కించుకున్న తొలి భారతీయ నటుడు బాలయ్య మాత్రమే. ఇక ఇటీవలే బాలకృష్ణ సినీ రంగానికి చేస్తున్న సేవలకు పద్మభూషణ్ అవార్డు కూడా దక్కింది. ఇలాంటి అరుదైన ఏడాదిలోనే వెండితెరపై శివ తాండవం చేసేందుకు బాలయ్య సిద్ధమయ్యారు.
Also Read : శ్రీశైలం మాకే… కాదు మాకు కావాల్సిందే..!
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న నాలుగో సినిమా అఖండ 2. సింహాతో మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం.. లెజెండ్ మీదుగా అఖండ వరకు చేరుకుంది. కరోనా సమయంలోనే అఖండతో థియేటర్లతో శివతాండవం చేశారు బాలయ్య. రికార్డుల మోతతో థియేటర్లకు ఊపిరి పోసింది అఖండ. అప్పటి వరకు థియేటర్‌కు వచ్చేందుకు వెనకడుగు వేసిన ప్రజలు.. అఖండ చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టారనేది వాస్తవం. ఓటీటీల రాజ్యంలో కూడా అఖండ వంద రోజులు ఆడిన సినిమా. ఈ సినిమాలో BOTH ARE NOT SAME అనే డైలాగ్ బాగా పాపులర్. ఇలాంటి కాంబో నుంచి వస్తున్న నాలుగో సినిమా అఖండ 2.
ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా షూటింగ్ సాగింది. అయితే సినీ కార్మికుల సమ్మె కారణంగా కొద్ది రోజుల పాటు బ్రేక్ పడింది. అఖండ 2 టీజర్ ఇప్పటికే యూ ట్యూబ్‌లో 3 కోట్ల వ్యూస్ సాధించింది. దసరా పండుగ సందర్భంగా సెప్టెంబర్ 25న అఖండ 2 రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. అయితే వీఎఫ్ఎక్స్ పనులకు ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో సినిమా రిలీజ్ ఆలస్యం అవుతుందా అనే అనుమానం తలెత్తింది. దసరా రేసులో పవన్ కల్యాణ్ OG కూడా ఇప్పుడు చేరింది. దీంతో అఖండ 2 రిలీజ్ 2 రోజులు ఆలస్యం అవుతుందా అనే అనుమానం టాలీవుడ్‌లో వినిపిస్తోంది. బాలయ్య, పవన్ మంచి దోస్తులు. ప్రస్తుతం ఈ ఇద్దరు కూటమి సర్కార్‌లో కీలక నేతలు కూడా. ఈ ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు కూడా లేవు. కాబట్టి.. ఒకేరోజు రిలీజ్ చేస్తే.. కలెక్షన్లపై ప్రభావం పడుతుందనే మాట కూడా వినిపిస్తోంది. కాబట్టి.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Also Read : వినాయక ఉత్సవాలకు సర్కార్ గుడ్ న్యూస్..!
అయితే ఈ ఏడాది బాలయ్యకు ఎంతో ప్రత్యేకం. ఓ వైపు పద్మభూషణ్ అందుకున్న ఆనందం.. మరోవైపు 50 ఏళ్ల సినీ ప్రయాణం.. ఇంకోవైపు గిన్నిస్ బుక్ గోల్డ్ ఎడిషన్‌లో పేరు.. ఇలాంటి పరిస్థితుల్లో అఖండ 2 స్పెషల్ అట్రాక్షన్‌గా మారింది. దీంతో ఫ్యాన్స్ అంచనాలు ఏ మాత్రం తగ్గకుండా ఉండేందుకు దర్శకుడు బోయపాటి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారనే మాట టాలీవుడ్ సర్కిల్‌లో వినిపిస్తోంది. ఈ సినిమా బిజినెస్ ఇప్పటికే పూర్తయినట్లు కూడా తెలుస్తోంది. అఖండ అంచనాలు డబుల్ చేసేలా అఖండ 2 ఉంటుందనేది బోయపాటి మొదటి చెబుతున్న మాట. టీజర్ కూడా అదే రేంజ్‌లో ఉంది. అఖండ 2 సినిమాకు థియేటర్లలో స్పీకర్లు పేలిపోవడం ఖాయమంటున్నారు అభిమానులు. బాలకృష్ణ, బోయపాటి కాంబో సినిమా బీబీ-4 కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నామనేది బాలయ్య ఫ్యాన్స్ మాట. మొత్తానికి బీబీ-4 నందమూరి బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రయాణం సరికొత్త రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలంటే.. దసరా పండుగ వరకు ఆగాల్సిందే.