ఢిల్లీలో యమునా నది సాక్షిగా పొలిటికల్ పార్టీలు యుద్ధానికి దిగాయి. నదిలో విషం వ్యవహారంపై నువ్వా నేనా అన్నట్లు ఎదురు దాడి చేసుకుంటున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వణికించే చలిలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. యమునా నది వ్యవహారంపై రెండు దేశాల మధ్య యుద్ధంలా చూడొద్దని కేజ్రీవాల్‌కు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. పెరిగిన అమోనియా స్థాయిలను విషప్రయోగం అనే అంశంతో కలపకుండా.. నదిలోని నీటి స్వభావం, పరిణామం, విషపూరితమైన విధానం, దాన్ని గుర్తించే పద్ధతులపై సరైన సాక్ష్యాలను.. ఢిల్లీ జల్ బోర్డుకు సమర్పించాలని ఆదేశించింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : పుష్పకు హ్యాండిచ్చిన త్రివిక్రమ్..?
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసులపై ఆప్ అధినేత కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. యమునా నది అంశంపై ఎన్నికల సంఘం తనకు పంపిన నోటీసుల్లో ఉపయోగించిన భాష సరిగ్గా లేదన్నారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదంటూనే.. తాను ఓ 3 బాటిళ్ల యమునా నది నీళ్లను ఈసీ అధికారులతో పాటు.. అమిత్ షా, రాహుల్ గాంధీ, హర్యానా సీఎంకు పంపిస్తానన్నారు. వారు ఆ నీటిని మీడియా ముందే తాగితే.. తన తప్పు ఒప్పుకుంటానని వెల్లడించారు. అంతేకాకుండా మరో రెండు రోజుల్లో తనను జైలుకు పంపించే కుట్రలు చేస్తున్నారన్నారు.
యమునా నదిని కలుషితానికి బీజేపీ కారణమంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. ఎన్నికల్లో గెలవడం కోసం నదిలో విషం కలుపుతున్నారని ఆరోపిస్తున్నారన్నారు. ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని అందించడంలో ఆప్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కేజ్రీవాల్ పాలనలో యమునా నది గతంలో కంటే కలుషితమైందన్నారు. ప్రజలు మురికి నీటిని తాగాల్సి వస్తుందని అమిత్ షా ఆరోపించారు.
Also Read : అమరావతి టార్గెట్ గా వైసీపీ కుట్ర..!
కేజ్రీవాల్ పరిపాలనలో స్వచ్ఛత గురించి మాట్లాడతారని.. అయితే ఢిల్లీలో అతిపెద్ద కుంభకోణం ఆయన పర్యవేక్షణలో జరిగిందని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. యమునా నదీ జలాలను తాగడానికి, స్నానానికి పనికి వచ్చేంతగా శుద్ధి చేస్తానని హామీ ఇచ్చిన కేజ్రీవాల్.. ఇప్పుడు యమున నీటిని తాగి చూపించాలని సవాల్ విసిరారు. మరికొద్ది రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో యమునా నది వ్యవహారంపై విమర్శలు, ప్రతి విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి.

