ఏపీలో లిక్కర్ కేసులో సిట్ పట్టు బిగిస్తోంది. ఈ కేసు విచారణలో భాగంగా ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మొత్తం 11 మందిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. చెవిరెడ్డితో పాటు నాటి సీఎంఓ అధికారి ధనుంజయ్ రెడ్డి, మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డితో పాటు భారతీ సిమెంట్ శాశ్వత డైరెక్టర్ బాలాజీ గోవిందప్ప, రాజ్ కేసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వంటి జగన్‌కు అత్యంత సన్నిహితులను కూడా అరెస్టు చేశారు. తాజాగా ఈ కేసులో ఏ4 నిందితుడు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అరెస్టుకు సిట్ అధికారులు రంగం సిద్ధం చేశారు. లిక్కర్ స్కామ్‌లో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిపై తొలి నుంచి విమర్శలు వస్తున్నాయి. సిట్ అధికారులు కూడా ఒకసారి మిథున్ రెడ్డిని విచారించారు. చెవిరెడ్డి అరెస్టు తర్వాత తనను కూడా అరెస్టు చేస్తారని భావించిన మిథున్ రెడ్డి… హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు.
Also Read : జూబ్లీహిల్స్ బై పోల్.. సీన్‌లోకి కొత్త పేరు..!
ఆఘమేఘాల మీద సుప్రీం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు మిథున్ రెడ్డి. దీనిపై విచారణ జరిపించిన సుప్రీం ధర్మాసనం.. ఇరు పక్షాల వాదనల తర్వాత మిథున్ దాఖలు చేసిన పిటీషన్‌ను తిరస్కరించింది. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. అరెస్టు చేయకుండా ఛార్జ్‌షీట్ ఎలా దాఖలు చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. కేసులో ఏ4గా ఉన్న నిందితుడు మిథున్ రెడ్డిని ఇప్పటి వరకు ఎందుకు అరెస్టు చేయలేదని కూడా ప్రశ్నించింది. ముందస్తు బెయిల్ పిటీషన్ కోర్టులో ఉన్న కారణంగా ఆలస్యమైందన్నారు. దీంతో సుప్రీం ధర్మాసనం పిటీషన్‌పై విచారణ జరిపింది.
Also Read : నారా లోకేష్ పైన ఇంత కోపం ఎందుకు..?
మిథున్ రెడ్డి తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తునకు మిథున్ సహకరిస్తున్నారని.. విచారణకు కూడా హాజరయ్యారన్నారు. అయితే సుప్రీం కోర్టు మాత్రం ముందస్తు బెయిల్ పిటీషన్‌ను కొట్టేసింది. ఆ వెంటనే అరెస్ట్ వారెంట్ కోసం ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహిత్గీ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో మిథున్ అరెస్టు ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం మిథున రెడ్డి అజ్ఞాతంలో ఉన్నారు. బెయిల్ పిటీషన్ కొట్టివేయడంతో.. మిథున్ రెడ్డి ఎక్కడ ఉన్నారనే సమాచారం కోసం సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఆర్థిక లావాదేవీలను మిథున్ రెడ్డి స్వయంగా చూసుకున్నారని.. వచ్చిన డబ్బును స్వయంగా ఆయన హవాలా మార్గాల్లో తరలించారని కూడా ఆరోపణలున్నాయి.
Also Read : పాపం ఆయన సంగతేంటి..? మాజీ సీఎం ఎదురు చూపులు..!
ఏపీ హైకోర్టులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ దక్కకపోయే సరికి.. ఆయన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లారు. ప్రస్తుతం విదేశాలకు పారిపోకుండా.. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులను సిట్ అధికారులు జారీ చేశారు. దీంతో ఆయన ఎక్కడ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించినా.. అడ్డంగా దొరికి పోవడం ఖాయం. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఎప్పుడైనా మిథున్ రెడ్డిని అరెస్టు చేస్తారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. త్వరలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో మిథున్ రెడ్డి అరెస్టు.. ఇప్పుడు వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది.