ఆంధ్రప్రదేశ్ లో నూతన లిక్కర్ పాలసీ విషయంలో ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి కాసుల వర్షం కురుస్తోంది. అనుకున్న దానికంటే ఎక్కువ ఆదాయమే రాష్ట్ర ప్రభుత్వానికి రావడం చూసి అధికారులు షాక్ అవుతున్నారు. గతంలో మాదిరిగానే లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు మద్యం షాపులను కేటాయిస్తోంది. దాదాపు 90 వేల అప్లికేషన్ లు రాష్ట్ర వ్యాప్తంగా మద్యం షాపులకు వచ్చాయి. వాటిని ఈరోజు లాటరీ పద్దతిలో కేటాయిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోటీ తీవ్రంగా ఉన్నా మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆశించిన స్తాయిలో లేదు.
కొన్ని ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఏపీలో మద్యం దరఖాస్తుల ఫైనల్ డేటా ఒకసారి పరిశీలిస్తే… 3396 దుకాణాలకు గాను 89, 882 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి 1797.64 కోట్ల ఆదాయం వచ్చింది. దరఖాస్తుల ద్వారా 1500 నుంచి 1600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ అంచనాల మించి దరఖాస్తు ఫీజు ద్వారా దాదాపు 1800 కోట్ల ఆదాయం వచ్చింది. ఎన్టీఆర్, గుంటూరు, ఏలూరు జిల్లాలతో పాటు పలు జిల్లాల్లో ఒక్కో దుకాణానికి సరాసరి 50 దరఖాస్తుల దాఖలు ఆయ్యాయి.
Also Read : నందిగం సురేష్ ను వెంటాడుతున్న పాత పాపాలు..!
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి దుకాణానికి సరాసరి 25 దరఖాస్తులు దాఖలు అయ్యాయి. డ్రాలో దుకాణం దక్కించుకున్న వ్యాపారులు.. 24 గంటల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఈనెల 16 నుంచి ఏపీలో ప్రైవేట్ మద్యం దుకాణాలు అందుబాటులోకి రానున్నాయి. ఏపీలో అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వస్తోంది. ఇక లెక్కలు చూస్తే న్యూ లిక్కర్ పాలసీ ద్వారా ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం వస్తోంది. షాపు దక్కించుకున్న వారు చెల్లించే తొలి విడత లైసెన్స్ రుసుముతో సుమారు రూ.300 కోట్ల ఆదాయం లభిస్తుంది. అలాగే వారం రోజులు సరకు కొనుగోలు ద్వారా మరో రూ.300 కోట్లకు పైగా వస్తుంది. ఇప్పటికే ఫీజుల రూపంలో ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం లభించింది. మొత్తంగా నూతన పాలసీ ప్రారంభంలోనే రూ.2400 కోట్ల ఆదాయం రాష్ట్ర ప్రభుత్వానికి రానుంది.