ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు రాజకీయం కాస్త ఆసక్తిగా మారుతోంది. వైసీపీ నుంచి కీలక నేతలు బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో గట్టిగానే జరుగుతోంది. ఇప్పటి వరకు వైఎస్ జగన్ కు అండగా ఉన్నారు అనుకున్న నేతలే ఆయనకు ఓ నమస్కారం అంటూ బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయడం ఆసక్తికరంగా మారుతోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నేతలు ఒక్కొక్కరిగా బయటకు వచ్చేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పారు.
జనసేన పార్టీ తీర్ధం కూడా ఆయన పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మరికొందరు నేతలు కూడా పార్టీ మారడానికి మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో చర్చలు జరుపుతున్నారు. తాజాగా మాజీ మంత్రి సిద్దా రాఘవరావు పార్టీ మారేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. గత మూడు నెలల నుంచి ఆయన ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. తాజాగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తో ఆయన భేటీ అయ్యారు. పార్టీ మారతాను అని చంద్రబాబును ఒప్పించే ప్రయత్నం చేయాలని కోరినట్టుగా సమాచారం.
Also Read : సాక్షి తప్పుడు రాతల మూల్యం రూ.75 కోట్లు?
అయితే ఇందుకు మంత్రి లోకేష్ సానుకూలంగా లేరని రాజకీయ వర్గాలు అంటున్నాయి. లోకేష్ కారణంగానే సిద్దా చేరిక వాయిదా పడుతూ వస్తోంది. ఇటీవల విజయవాడకు వరద సాయం పేరుతో సిద్దా చంద్రబాబుని కలిసిన సంగతి తెలిసిందే. ఇక కందుకూరు మాజీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి కూడా పార్టీ మారేందుకు సానుకూలంగా ఉన్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. మహిధర్ రెడ్డి ఎన్నికలకు ముందే పార్టీ మారాల్సి ఉన్నా అది సాధ్యం కాలేదు. వైసీపీకి కూడా ఆయన ముభావంగానే పని చేసారు. ఇప్పుడు గొట్టిపాటిని కలిసి పార్టీ మారాలని చూస్తున్నారట. త్వరలోనే వీరు కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.