ఏలూరి Vs ఆమంచి.. పర్చూరులో గెలుపెవరిది?
ఏపీలో ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జిల్లాల్లో రాజకీయాలు జోరందుకున్నాయి. ఎవరు ఎవరి వైపు ఉంటారు, ఎవరు ఎవరితో పొత్తులో ఉంటారు అన్న విషయాల్లో స్పష్టత రానప్పటికీ ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో అన్ని జిల్లాల్లో నామమాత్రంగానే సీట్లు సంపాదించినా టిడిపి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం చెప్పుకోదగ్గ స్థానాల్లో విజయం సాధించింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చీరాల, పర్చూరు, అడ్డంకి, కొండెపి స్థానాల నుంచి టిడిపి అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ కంచుకోటల్లో పర్చూరు కూడా ఒకటి. ఇక్కడ టిడిపి అదిరిపోయే విజయాలు అందుకుంది. గతంలో ఈ స్థానంలో టిడిపి కొంత వెనుకపడ్డట్లు కనిపించినప్పటికీ ఏలూరు రాకతో నియోజకవర్గంలో కొత్త ఊపు వచ్చినట్లు అయింది.
గత రెండు ఎన్నికల్లో వరుసగా టిడిపి నుంచి ఏలూరి సాంబశివరావు గెలుస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక టిడిపి సిట్టింగ్ సీట్లపై గట్టిగా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఆ సీట్లని కూడా కైవసం చేసుకోవాలని గట్టిగా ట్రై చేస్తుంది. ఈ క్రమంలోనే పర్చూరుపై కూడా వైసీపీ ఫోకస్ పెట్టింది. అక్కడ పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. టిడిపికి చెక్ పెట్టాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఇంచార్జ్‌లని మారుస్తూ వచ్చారు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన పార్టీలో కనిపించలేదు. రాజకీయాలకు దూరం అయ్యారు. దీంతో రావి రామనాథం బాబుని ఇంచార్జ్ గా పెట్టారు.
ఆయన పర్చూరులో పార్టీని బలోపేతం చేయడానికి గట్టిగానే కృషి చేశారు. గడపగడపకు తిరగడంలో నెంబర్ 1 గా నిలిచారు. అయినా సరే ఈయన్ని మార్చి ఆమంచి కృష్ణమోహన్‌ని ఇంచార్జ్ గా పెట్టారు. చీరాలలో ఆమంచికి వ్యక్తిగతంగా తీవ్ర వ్యతిరేకత రావడం, అక్కడ టిడిపి నుంచి వెళ్లిన కరణం బలరాం ని కాదనలేకపోవడంతో అక్కడ నుంచి నుంచి తీసుకొచ్చి పర్చూరులో పెట్టారు. కానీ ఆమంచికి పర్చూరు పై పట్టు దొరకలేదు. ఇక్కడ టిడిపి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు బలం తగ్గక పోగా ఇంకా పెరిగింది. పైగా ఆమంచిని ఇంచార్జ్ గా పెట్టడం వల్ల రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.
ఆమంచి కాపు వర్గం.. పర్చూరులో కాపుల ఓట్లు కలిసొస్తాయని జగన్ భావించారు. కానీ అక్కడ మెజారిటీ కాపులు ఏలూరి వైపు ఉన్నారు. జనసేనతో పొత్తు ఉంటే ఇంకా ప్లస్. గతంలో ఉన్న రావి రామనాథం బాబు కమ్మవర్గం.. దీనివల్ల వైసీపీకి కాస్త కమ్మ వర్గం కలిసోచ్చేది. కానీ ఆయన్ని తప్పించడం వల్ల కమ్మవర్గం వన్ సైడ్ గా టిడిపి వైపు ఉంది. మొత్తానికి పర్చూరులో ఏలూరికి తిరుగులేదని చెప్పాలి.




