దున్నపోతు అనే పదం ఇప్పుడు తెలంగాణలో పెద్ద దుమారం రేపుతోంది. అనాలోచితంగా.. అనేసిన ఓ మాట.. ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కూడా తలనొప్పిగా మారింది. చివరికి జాత్యహంకార వ్యాఖ్యలు చేస్తారా అంటూ వర్గపోరుకు తెర లేపే పరిస్థితికి దారి తీసింది. రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో ఇద్దరు మంత్రుల మధ్య వివాదం.. చివరికి ఆ పార్టీ పెద్దలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఏం చేయాలో అర్థం కాక అగ్రనేతలు సైతం తలలు పట్టుకుంటున్నారు.
Also Read : వన్డే సీరీస్ కు ముందు ఆసిస్ కు షాక్..!
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను ఉద్దేశించి దున్నపోతు అంటూ మరో మంత్రి పొన్నం ప్రభాకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీడియా సమావేశానికి సిద్ధమవుతున్న సమయంలో అడ్డూరి లక్ష్మణ్ కాస్త ఆలస్యంగా వచ్చారు. దీంతో కాస్త అసహనం వ్యక్తం చేసిన పొన్నం.. పక్కనే ఉన్న మరో మంత్రి గడ్డం వివేక్‌తో “మనకు టైమ్ అంటే తెలుసు, జీవితం అంటే ఏంటో తెలుసు.. దున్నపోతు వానికేం తెలుసు..” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు అక్కడే ఉన్న మీడియా కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ మాటలు సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారాయి. సహచర మంత్రి, పైగా దళిత సామాజిక వర్గానికి చెందిన నేతపై ఈ తరహాలో నోరు పారేసుకోవడాన్ని అంతా తీవ్రంగా తప్పుబడుతున్నారు.
పొన్నం ప్రభాకర్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఈ మాట తనను మాత్రమే కాదని.. తన జాతి మొత్తాన్ని అన్నట్లుగా లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. తన జాతి మొత్తాన్ని పొన్నం అవమానించారని.. దీని వెనుక గడ్డం వివేక్ కూడా ఉన్నారని ఆరోపించారు. తన పట్ల వివేక్ మొదటి నుంచి చిన్న చూపు చూస్తున్నారని కూడా అడ్లూరి లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మణ్ ను దున్నపోతు అని పొన్నం అనటం.. దానిని గడ్డం వివేక్ ఖండించకపోవడాన్ని ఎంఆర్‌పీఎస్ అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ తీవ్రంగా తప్పుబట్టారు. అసలు అడ్లూరి లక్ష్మణ్‌కు సంబంధించిన శాఖలో పొన్నం, వివేక్ ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీశారు. ఈ సమస్యకు పరిష్కారం పొన్నం ప్రభాకర్ చెప్పే క్షమాపణ మీదే ఆధారపడి ఉంటుందన్నారు. లేదంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని కూడా హెచ్చరించారు.
Also Read : విజయ్ దేవరకొండ యాక్సిడెంట్ వెనుక అసలు కారణం ఇదేనా?
ఈ వ్యవహారం మరింత ముదురుతుండటంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేశ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యేలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో సత్యనారాయణ, వేముల వీరేశం, శామ్యూల్, లక్ష్మీకాంత్, కాలే యాదయ్యతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను దున్నపోతు అంటూ అవమానించడంపై ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంత్రులతో ప్రత్యేకంగా మాట్లాడుతానని.. ఈ వివాదం సద్దుమణిగినట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ నేతలతో వ్యాఖ్యానించారు. మొత్తానికి దున్నపోతు వివాదం.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపుతోంది.