ఐదేళ్ల వైసీపీ పాలనలో అడ్డగోలుగా వ్యవహరించిన అధికారులపై ఏపీలో కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా, వైసీపీకి అనుకూలంగా వ్యవహరించడమే కాకుండా భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన అధికారుల భరతం పడుతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే గనుల శాఖ మాజీ ఎండీ వెంకటరెడ్డి, సీఐడీ మాజీ డీజీ సంజయ్, ఐపీఎస్ అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా వంటి అధికారులపై కేసులు నమోదు చేసిన ప్రభుత్వం తాజాగా మరో అధికారిపై కేసు నమోదు చేసింది.
Also Read :వారికి న్యూ ఇయర్ గిఫ్ట్ ఉంటుందా..?
జగన్ ప్రభుత్వంలో ఏపీ పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా వ్యవహరించిన విజయ్ కుమార్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదైంది. కమిషనర్‌గా పలు అవకతవకలకు పాల్పడినట్లు ఏసీబీ విచారణలో వెల్లడైంది. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఐ అండ్ పీఆర్ డిపార్ట్‌మెంట్‌లో అడ్డగోలుగా సిబ్బంది నియామకం, బ్లూ మీడియాకు నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేసిన విజయ్ కుమార్ రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. దీంతో విజయ్ కుమార్ రెడ్డిపై అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ప్రధానంగా వైఎస్ జగన్ సొంత పత్రిక సాక్షిలో పని చేసే వారికి, వైసీపీ సోషల్ మీడియాలో పని చేసే వారికి సమాచార శాఖలో అడ్డగోలుగా ఉద్యోగాలిచ్చారు. అసలు వారంతా ఏం పని చేశారో కూడా అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఇక ఇంటూరి రవికిరణ్ లాంటి వైసీపీ అభిమానులకు అయితే నిబంధనలకు విరుద్ధంగా అక్రిడేషన్ కార్డులు కూడా జారీ చేశారు విజయ్ కుమార్ రెడ్డి. ఎలక్ట్రానికి మీడియాకు రూ.26 కోట్లను ప్రకటనకు విడుదల చేస్తే… అందులో ఏకంగా రూ.16 కోట్లు కేవలం బ్లూ మీడియాకు మాత్రమే చెల్లించారు. ఇక వైసీపీ నేతలు ఎల్లో మీడియా అని ముద్ర వేసిన ఈ టీవీ, ఏబీఎన్, టీవీ 5 సంస్థలకు అసలు ప్రకటనలు ఇవ్వకుండా విజయ్ కుమార్ రెడ్డి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక పత్రికలకు క్లాసిఫైడ్, డిస్ ప్లే ప్రకటనల కోసం రూ.859 కోట్లు విడుదల చేస్తే… కేవలం సాక్షి పత్రికకు మాత్రమే రూ.355 కోట్లు కేటాయించారు. 43 శాతం నిధులను ఒక్కసాక్షికే విడుదల చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది.
Also Read : కర్ణాటక కాంగ్రెస్ మంత్రికి భారీ ఆఫర్ ఇచ్చిన అమిత్ షా…?
ఇక సాక్షి పత్రిక అడిగిన వెంటనే అడిగిన దానికంటే ఎక్కువగా ప్రకటనల రేటును విజయ్ కుమార్ రెడ్డి పెంచినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సాక్షి పత్రికలో కాలం సెంటీమీటర్‌ను రూ.2,600కు పెంచాలని కోరగా… విజయ్ కుమార్ రెడ్డి మాత్రం రూ.2,900కు పెంచేసినటలు ఏసీబీ విచారణలో తేలింది. ఇక డిజిటల్ కార్పొరేషన్‌కు చెందిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి ఆదేశాల మేరకు అక్రమ నియామకాలు చేపట్టినట్లు ఏసీబీ గుర్తించింది. అసలు ఎలాంటి అర్హతలు లేకుండానే నియామకాలు చేపట్టారు విజయ్ కుమార్ రెడ్డి. అవినీతి నిరోధక చట్టంలోని 17A కింద ఏసీబీ అధికారులు విచారణ చేశారు. ఈ మేరకు విజయ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.